తెలంగాణ టెట్ – 2022ను(TSTET-2022) వాయిదా వేయాలని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఆర్‌ఆర్‌బీ, టెట్ పరీక్షలు రెండూ ఒకే రోజున నిర్వహిస్తుండటం వల్ల ఒకదానికి మాత్రమే హాజరయ్యేందుకు అవకాశం ఉంది. రెండు పరీక్షలూ రాసే విద్యార్థులు.. ఇలా చేయడం వల్ల నష్టపోతారన్నారు. ఆర్‌ఆర్‌బీ అనేది జాతీయ స్థాయి పరీక్ష కాబట్టి ఇది వాయిదా వేయడం కుదరదన్న బండి సంజయ్(Bandi Sanjay).. రాష్ట్రస్థాయిలో నిర్వహించే టెట్‌ను వాయిదా వేసి, మరో తేదీన నిర్వహించాలని కోరారు. నిరుద్యోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తక్షణమే టెట్‌ను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు.. టెట్-2022 రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల12న జరగనుంది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు తప్పనిసరిగా ఓఎమ్‌ఆర్ షీట్‌లో బబ్లింగ్ చేయడానికి బ్లాక్ ఇంక్ పెన్నులను మాత్రమే వాడాలని ఎన్సీఈఆర్టీ సెక్రటరీ రాధారెడ్డి తెలిపారు. పరీక్షకు సంబంధించిన హాల్ టిక్కెట్లు ఇప్పటికే విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష నిర్వహణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. టెట్ పరీక్ష అనంతరం వీటి ఫలితాలు ఈ నెలలో 27న విడుదలవ్వనున్నాయి.