Telangana: కొలువుదీరనున్న అసెంబ్లీ.. విపక్ష నేత‌పై వీడని ఉత్కంఠ..!

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో.. కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అసెంబ్లీ ఎన్నికల్లో 64 మంది ఎమ్మెల్యేలతో గెలిచిన కాంగ్రెస్.. అధికార పీఠంపై కూర్చుంది. ఇప్పటికే సీఎంగా రేవంత్ రెడ్డితో పాటు 11 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. అయితే గెలిచిన 119 ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారంపై కూడా అధికారులు దృష్టిపెట్టారు.

Telangana: కొలువుదీరనున్న అసెంబ్లీ.. విపక్ష నేత‌పై వీడని ఉత్కంఠ..!
Telangana Assembly

Edited By:

Updated on: Dec 09, 2023 | 6:19 AM

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో.. కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అసెంబ్లీ ఎన్నికల్లో 64 మంది ఎమ్మెల్యేలతో గెలిచిన కాంగ్రెస్.. అధికార పీఠంపై కూర్చుంది. ఇప్పటికే సీఎంగా రేవంత్ రెడ్డితో పాటు 11 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. అయితే గెలిచిన 119 ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారంపై కూడా అధికారులు దృష్టిపెట్టారు. ఇదే విషయంలో అసెంబ్లీ కార్యదర్శి.. సీఎం రేవంత్ రెడ్డితో కూడా చర్చించారు. ఈక్రమంలోనే.. శనివారం.. తెలంగాణ అసెంబ్లీ తొలిసారి సమావేశం కాబోతోంది. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.

తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 119 సీట్లు ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 64 స్ధానాల్లో విజయం సాధించింది. బీఆర్ఎస్ 39 సీట్లలో గెలిచింది. బీజేపీ 8 స్థానాలు, ఎంఐఎం 7 స్థానాలు, సీపీఐ ఒక స్థానం గెలిచాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో… ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించాల్సి ఉంటుంది. అయితే.. ప్రొటెం స్పీకర్‌ ఎంపిక అనేది కీలకం..! కొత్త స్పీకర్‌ను ఎన్నుకునేంత వరకు ప్రొటెం స్పీకర్‌ బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. సాధారణంగా ఎక్కువసార్లు శాసనభకు ఎన్నికైన ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తారు.

ప్రస్తుతం అత్యధికంగా ఎనిమిది సార్లు ఎన్నికైన శాసన సభ్యులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నారు. బీఆర్‌ఎస్‌కు చెందిన ఇతర సభ్యుల్లో.. మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, దానం నాగేందర్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఆరుసార్లు ఎన్నికైన శాసనసభ్యులు. కాంగ్రెస్‌లో ఆరుసార్లు ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావులు ఇద్దరూ మంత్రులుగా నియమితులయ్యారు. ఎంఐఎం పార్టీకి చెందిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ ఆరుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. సీనియారిటీ ప్రకారం మాజీ సీఎం కేసీఆర్‌ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించాల్సి ఉంది. అయితే.. అంతలోనే.. కేసీఆర్‌.. బాత్‌రూమ్‌లో జారిపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ పరిస్థితుల్లో అక్బరుద్దీన్‌ ఓవైసీను ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేశారు.

శనివారం ఉదయం 8.30కి ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌తో రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాత.. శాసనసభలో ఎమ్మెల్యేలతో అక్బరుద్దీన్‌ ప్రమాణస్వీకారం చేయిస్తారు. నిబంధనల ప్రకారం వీరు ప్రమాణస్వీకారం చేసిన తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల ఎన్నిక ఉంటుంది. అనంతరం విపక్ష నేత, ఉపనేత, ప్రభుత్వ విప్‌ల ఎంపిక తంతు పూర్తి చేస్తారు. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్‌ను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. దీంతో ఆయన ఎన్నిక లాంఛనమే కానుంది. మరి డిప్యూటీ స్పీకర్‌గా ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి. అలాగే విపక్ష నేతగా కేసీఆర్ ఈసారి ఉండే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఆయనకు బదులుగా కేటీఆర్, హరీష్‌లో ఎవరుంటారనేది కూడా ఉత్కంఠ రేపుతోంది.