హైదరాబాద్‌ KBR నేషనల్ పార్క్ పరిరక్షణపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

KBR National Park పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈకో-సెన్సిటివ్ జోన్‌లో సుమారు 1,300 చెట్లు నరికే ప్రమాదం ఉందన్న పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం, తదుపరి విచారణ వరకు ఎలాంటి చెట్ల నరికివేత జరగకూడదని స్టే విధించింది. ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణాల కోసం చెట్ల తొలగింపుపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత అధికారులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

హైదరాబాద్‌ KBR నేషనల్ పార్క్ పరిరక్షణపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
KBR Park

Edited By:

Updated on: May 18, 2026 | 1:51 PM

కేబీఆర్ నేషనల్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. KBR పార్క్ చుట్టుపక్కల ఉన్న ఈకో-సెన్సిటివ్ జోన్‌లో చెట్లు నరకడాన్ని అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జ్వల్ భుయాన్‌ల ధర్మాసనం చెట్ల నరికివేతపై తాత్కాలిక స్టే విధించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ తరపు న్యాయవాది వివేక్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కేబీఆర్ పార్క్ ఈకో-సెన్సిటివ్ జోన్‌లో సుమారు 1,300 చెట్లను నరికే ప్రమాదం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం రోజుకు దాదాపు 50 చెట్ల వరకు పగలు-రాత్రి తేడా లేకుండా నరుకుతున్నారని తెలిపారు. ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం కోసం చెట్ల నరికివేత తప్పదని అధికారులు చెబుతున్నారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ధర్మాసనం కీలక ప్రశ్నలు సంధించింది. “చెట్లు నరకకుండా ప్రాజెక్టుల నిర్మాణం సాధ్యం కాదా?” అని ప్రశ్నించగా, నిర్మాణ పనులకు చెట్ల తొలగింపు అవసరమని వాదనలు వినిపించాయి. అయితే గతంలో ఈకో-సెన్సిటివ్ జోన్‌లో చెట్ల నరికివేతపై కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, హైకోర్టు వేసవి సెలవుల సమయంలో ప్రభుత్వం పరిస్థితిని తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటోందని పిటిషనర్ ఆరోపించారు.

అంతేకాకుండా, గతంలో 25 మీటర్లుగా ఉన్న ఈకో-సెన్సిటివ్ జోన్‌ను ఇప్పుడు 3 మీటర్లకు తగ్గించారని, ప్రజల అభ్యంతరాలను పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని కోర్టుకు వివరించారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు తదుపరి విచారణ జరిగే వరకు కేబీఆర్ నేషనల్ పార్క్ ఈకో-సెన్సిటివ్ జోన్‌ (25 నుంచి 35 మీటర్ల పరిధి)లో ఎలాంటి చెట్ల నరికివేత జరగకూడదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పిటిషనర్ తరపు న్యాయవాది రాష్ట్ర స్టాండింగ్ కౌన్సిల్‌కు నోటీసులు అందజేయాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను జూలై 27కు వాయిదా వేసింది. హైదరాబాద్‌లోని అతిపెద్ద గ్రీన్ జోన్‌లలో ఒకటైన కేబీఆర్ పార్క్ రక్షణ కోసం పర్యావరణవేత్తలు, స్థానిక ప్రజలు చాలా కాలంగా పోరాటం కొనసాగిస్తున్నారు.

నీల్గాయ్.. చూడ్డానికి భలే అందంగా ఉంటుంది.. కెలికితే మాత్రం..

 

Follow Us