Hyderabad: గ్రేటర్‌లో హడలెత్తిస్తున్న వీధికుక్కులు .. హైదర్‌గూడలో మరో బాలుడిపై దాడి.. అడ్డుకున్న మరో చిన్నారిపై కూడా..

|

Feb 22, 2023 | 3:38 PM

అంబర్‌పేట్‌లో చిన్నారి ప్రదీప్‌ను చంపేసిన కుక్కలు  చైతన్యపురిలో మరో బాలుడిపై దాడి చేశాయి. తాజాగా హైదర్‌గూడలోనూ ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. రెచ్చిపోయిన వీధికుక్కలు ఇంటి ఎదుట ఆడుకుంటున్న బాలుడిపై మూకుమ్మడి దాడి చేశాయి.

Hyderabad: గ్రేటర్‌లో హడలెత్తిస్తున్న వీధికుక్కులు .. హైదర్‌గూడలో మరో బాలుడిపై దాడి.. అడ్డుకున్న మరో చిన్నారిపై కూడా..
Stray Dogs Attack
Follow us on

గ్రేటర్‌ హైదరాబాద్‌లో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. పసిబిడ్డలు రోడ్డుమీదికి వెళ్ళాలంటే హడలిపోతున్నారు. కాలనీల్లో నడవాలంటేనే కంగారు పడుతున్నారు. అసలు రోడ్డు మీదకు రావాలంటేనే వణికిపోయేలా కుక్కలు దాడి చేస్తున్నాయ్. అంబర్‌పేట్‌లో చిన్నారి ప్రదీప్‌ను చంపేసిన కుక్కలు  చైతన్యపురిలో మరో బాలుడిపై దాడి చేశాయి. తాజాగా హైదర్‌గూడలోనూ ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. రెచ్చిపోయిన వీధికుక్కలు ఇంటి ఎదుట ఆడుకుంటున్న బాలుడిపై మూకుమ్మడి దాడి చేశాయి. దీనిని అడ్డుకున్న మరో బాలుడిని కరవడంతో తీవ్ర గాయాలయ్యాయి. మరో వైపు హైదరాబాద్‌ సిటీలో కుక్కలబెడదపై టీవీ9 వరుస కథనాలతో బల్దియా సిబ్బంది కదిలింది. జంటనగరాల్లోని పలు ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ వెటర్నరీ విభాగం అధికారులు హైదరాబాద్  పరిధిలో విస్తృతంగా స్ట్రీట్‌ డాగ్స్‌ను పట్టుకుని రేబిస్ వ్యాక్సిన్‌ ఇవ్వడం, స్టెరిలైజ్‌ చేస్తున్నారు. వీధుల్లో కుక్కలను క్యాచ్‌ చేసి వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ జరిగిందా..? లేదా అని పరిశీలిస్తున్నారు. కుక్కకు వి షేప్‌లో చెవి దగ్గర కట్‌ చేసి ఉంటే..స్టెరిలైజ్‌ చేసినట్లు గుర్తిస్తారు. దాంతో ఆ కుక్కలో అగ్రెసివ్‌ తగ్గిపోయి, ఎవరినైనా కరిచినా ఏం కాదని జీహెచ్‌ఎంసీ వెటర్నీ సిబ్బంది చెబుతున్నారు. వీధికుక్కలకు ఒకవేళ స్టెరిలైజ్‌ ఉంటే.. ఆ తర్వాత ఏఆర్‌వీ ఇంజక్షన్‌ ఇస్తామని జీహెచ్‌ఎంసీ సిబ్బంది తెలిపారు.

ఆస్పత్రుల్లోనూ స్వైర విహారం..

కాగా కాలనీలు, వీధుల్లో తిరిగే కుక్కలకు రెగ్యులర్‌గా జీహెచ్‌ఎంసీ స్టెరిలైజ్‌ చేస్తోంది. ఆ తర్వాత రేబిస్‌ ఇంజక్షన్‌ ఇచ్చి, మళ్లీ అదే కాలనీలో వదిలిపెడుతున్నారు జీహెచ్‌ఎంసీ వెటర్నరీ సిబ్బంది. సిటీలోని అన్నీ కాలనీలో 80 నుంచి 85 శాతం వీధికుక్కలకు స్టెరిలైజ్‌ చేసినట్లు బల్దియా సిబ్బంది చెబుతోంది. దాదాపు 5 లక్షల 75వేలకు పైగా ఉన్న డాగ్స్‌లో 4 లక్షలకుపైగా కుక్కలకు స్టెరిలైజ్‌ చేశామని తెలిపారు. సుప్రీంకోర్టు రూల్స్‌, యానిమాల్‌ యాక్ట్‌ ప్రకారం కుక్కలకు స్టెరిలైజ్‌ చేస్తున్నారు. మరోవైపు కుక్కలు కరిస్తే..ఇంజెక్షన్‌ తీసుకునేందుకు బాధితులు ఐపీఎం, ప్రభుత్వాస్పత్రికి వెళ్తే…అక్కడ కూడా శునకాల గుంపు స్వైరవిహారం చేస్తున్నాయి. దాంతో వ్యాక్సిన్‌ కోసం వచ్చిన పేషెంట్స్‌, వారి పేరెంట్స్‌కు ఆస్పత్రిలో కుక్కలు చుక్కలు చూపుతున్నాయి.

ఒక్క హైదరాబాదే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా గ్రామసింహాలు రెచ్చిపోతున్నాయి. బాలురు, వృద్దులే టార్గెట్‌గా రెచ్చిపోతున్నాయి. మూకుమ్మడిగా దాడిచేస్తున్నాయి. ఎప్పుడు..ఎటువైపు నుంచి దాడి చేస్తాయోనని భయపడిపోతున్నారు. తాజాగా చైతన్యపురి, కరీంనగర్‌జిల్లాలో కుక్కలు పిల్లలపై దాడులకు పాల్పడ్డాయి. గ్రేటర్‌ పరిధిలో కుక్కల నియంత్రణకు బల్దియా వెటర్నరీ సిబ్బంది చేపట్టిన చర్యలతో నగరవాసులకు ఉపశమనం లభిస్తుందా..? స్టెరిలైజ్‌, రేబిస్‌ వ్యాక్సిన్‌తో కుక్కకాట్లు తగ్గుతాయా..? లేక రానున్న సమ్మర్‌లో మరింత శునకాలు రెచ్చిపోతాయా..? అనేది వేచిచూడాలి.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం.. క్లిక్ చేయండి..