కొంతమంది చిన్న చిన్న విషయాలకే.. సాటి వారిపై విచక్షణారహితంగా దాడి చేస్తున్నారు. మానవత్వం అనేదే మరిచి.. దారుణాలకు పాల్పడుతున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోని.. అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా.. హైదరాబాద్ నగరంలోని నాంపల్లిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. కిరాణా షాపులో కూల్‌డ్రింక్ దొంగిలించాడన్న కారణంతో ఓ యజమాని బాలుడిని చితక్కొట్టాడు అంతటితో ఆగకుండా ప్రైవేట్ పార్ట్స్ పై కారం చల్లి హింసించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను చిత్రీకరించి.. ఏదో ఘన కార్యం చేసినట్లు పైశాచికానందం పొందాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నాంపల్లిలో కృష్ణ అనే వ్యక్తి కిరాణాషాప్ నడుపుతున్నాడు. ఈ క్రమంలో కూల్‌డ్రింక్ బాటిల్ దొంగతనం చేశాడంటూ బాలుడిపై దారుణంగా దాడిచేశాడు. బాలుడు దుస్తులు విప్పి.. కాళ్లూ చేతులు కట్టేసి ప్రైవేట్ పార్ట్స్‌పై కారం జల్లి కొట్టాడు. బాలుడిని చిత్రహింసలకు గురిచేస్తూ పైశాచికానందం పొందాడు. అంతటితో ఆగకుండా బాలుడు అల్లాడుతున్న వీడియోలను కృష్ణ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు.
అయితే, ఈ వీడియోలను చూసిన తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. అనంతరం పోలీసులను ఆశ్రయించి.. జరిగిన విషయాన్ని చెప్పారు. రంగంలోకి దిగిన పోలీసులు కృష్ణను అదుపులోకి తీసుకుని బాలుడిని విడిపించారు. చిన్న పిల్లాడని కూడా చూడకుండా ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డ షాపు యజమాని కృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి కృష్ణను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..