Hyderabad Crime News: నిర్భయ లాంటి కఠిన చట్టాలున్నప్పటికీ.. మహిళలపై వేధింపులు ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్ లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని జూబ్లీహిల్స్‌లో సామూహిక అత్యాచార ఘటన మరువకముందే.. బంజారాహిల్స్‌లో మరో అఘాయిత్యం చోటుచేసుకుంది. ఓ యువతిని గదిలో బంధించి సెక్యూరిటీగార్డు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ఈ నెల 4న జరిగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంజరాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌లోని ఓ బస్తీకి చెందిన యువతికి.. అదే ప్రాంతంలోని ఓ మాల్ లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న చిన్మయి సైక్యా (22) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. దీంతో ఆ యువకుడు యువతిపై కన్నేశాడు. ఈ నెల 4న బాధితురాలి ఇంటికి ఏదో పని ఉందంటూ వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేరని గమనించిన అతను.. యువతిని గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని యువతిని బెదిరించాడు.
ఈ దారుణాన్ని జీర్ణించుకోలేని.. ఆ యువతి మరుసటి రోజు ఉదయం తనకు చనిపోవాలని ఉందంటూ స్నేహితురాలికి మెస్సెజ్ పంపింది. వెంటనే ఆమె బాధితురాలి సోదరికి ఈ విషయాన్ని చెప్పింది. వెంటనే ఆమె.. బాధితురాలిని ప్రశ్నించగా.. ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు.. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.