Hyderabad: ఫ్లాట్ కొనేవారు జాగ్రత్త! సేల్ డీడ్, రిజిస్ట్రేషన్ ఉన్నా ఈ పత్రాలు తప్పనిసరిగా చూడండి
హైదరాబాద్ మహానగరంలో అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపబోతోందా?.. అనుమతులకు విరుద్ధంగా అంతస్తులు పెంచడం.. ఆపై అమాయక కస్టమర్లకు అంటగట్టే ప్రక్రియకు చెక్ పెట్టబోతోందా?.. కఠిన నిబంధనలతో కొత్త చట్టాన్ని అమలు చేయబోతోందా?.. సెక్షన్ 168తో కొరడా ఝుళిపించబోతోందా?.. ఇప్పుడిదే సెక్షన్.. రియల్ ఎస్టేట్ రంగానికి షాకిస్తోందా?.. ఆస్తి కొనుగోలుదారులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతుందా?.. ఇంతకీ.. అసలేంటీ.. సెక్షన్ 168?.. ఈ చట్టం అమలుతో రియల్ ఎస్టేట్‌కు వచ్చే నష్టమేంటి?..

హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం అమలు చేయబోతున్న చట్టంలోని సెక్షన్ 168 హాట్‌టాపిక్‌గా మారింది. ఈ సెక్షన్ కింది భవన నిర్మాణానికి అనుమతులు లేకపోయినా.. అనుమతించిన అంతస్తులకు మించి అదనపు అంతస్తులు నిర్మించినా.. వాటిని అనధికార నిర్మాణాలుగా పరిగణించే అవకాశం ఉంది. ఇలాంటి నిర్మాణాలను కొనడం, అమ్మడం, బహుమతిగా ఇవ్వడం, లీజుకు ఇవ్వడం, తనఖా పెట్టడం లేదా ఇతర మార్గాల్లో బదలాయించడాన్ని సెక్షన్ 168(3) అడ్డుకట్ట వేస్తుంది. అంటే అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టి.. ఆ తర్వాత ఫ్లాట్లు అమ్మేసి తప్పించుకునేవారికి ఈ రూల్ అడ్డంకిగా కానుంది. అంతేకాదు.. నిర్మాణం అక్రమం అని ఎవరు నిర్ధారిస్తారు?.. ఏ ప్రక్రియలో నిర్ణయం తీసుకుంటారు?.. ఇప్పటికే కొనుగోలు చేసిన ఫ్లాట్ల పరిస్థితి ఏంటి?.. అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
వాస్తవాలు, అమలు విధానం ఆధారంగానే కొత్త చట్టం ప్రభావం
అక్రమ నిర్మాణాలున్న ఆస్తుల లావాదేవీల విషయంలో సెక్షన్ 168(3)తో పాటు 168(4) ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నిషేధాన్ని ఉల్లంఘించి ఆస్తిని బదలాయిస్తే ఆ లావాదేవీ చెల్లుబాటు కానిదిగా పరిగణిస్తుంది. అలాగే.. రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22-A(1)(a) ప్రకారం సంబంధిత పత్రాల రిజిస్ట్రేషన్‌పైనా ఆంక్షలు వర్తించే అవకాశం ఉంది. దీంతో.. ఫ్లాట్లు కొనుగోలు చేయాలనుకునేవారు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కేవలం సేల్ డీడ్ ఉందని.. రిజిస్ట్రేషన్ జరిగిందని.. భవనం పూర్తిగా చట్టబద్ధమైనదని భావించడం సరికాదు. నిర్మాణ అనుమతులు, ఆమోదించిన ప్లాన్, అనుమతించిన అంతస్తులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ వర్తించే సందర్భాల్లో దాని వివరాలు పరిశీలించాల్సి ఉంటుంది. అయితే.. ప్రతి రిజిస్ట్రేషన్ ఆటోమేటిక్‌గా రద్దవుతుందని భావించకూడదు.. సంబంధిత చట్టం, వాస్తవాలు, అమలు విధానం ఆధారంగా మాత్రమే ప్రభావం చూపిస్తుంది.
కొత్త చట్టం అమలు తేదీ, ప్రభావం, చట్టపరమైన రక్షణపై క్లారిటీ
ఇక.. కొత్త నిబంధనల్లో మరో కీలక అంశమూ ఉంది.. చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత చేపట్టే నిర్మాణాలే కాదు.. చట్టం అమల్లోకి వచ్చిన తేదీకి ముందు ప్రారంభమై.. పూర్తికాని అనధికార నిర్మాణాలపైనా ప్రభావం ఉంటుంది. అంతేకాదు.. అనధికార నిర్మాణంలో ఏదైనా భాగం చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత నిర్మిస్తే.. ఆ మొత్తానికి కొత్త చట్టం వర్తించనుంది. దీంతో.. అనుమతించిన అంతస్తుల కంటే ఎక్కువగా నిర్మించి విక్రయించే బిల్డర్లకు కొత్త చట్టం సవాల్‌గా మారనుంది. ఈ లెక్కన.. అక్రమ నిర్మాణాలను గుర్తించడంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ఏళ్ల తరబడి అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతుంటే సంబంధిత అధికారులు ఏం చేశారనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. చట్టాన్ని కఠినంగా అమలు చేయడం కాదు.. కొనుగోలుదారులకు అనుమతులపై స్పష్టమైన సమాచారం అందించేలా ప్రత్యేక వ్యవస్థ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా.. ఈ నిబంధనల అమలు తేదీ, ఇప్పటికే పూర్తయిన భవనాలపై ప్రభావం, కొనుగోలుదారులకు లభించే చట్టపరమైన రక్షణపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.
మొత్తంగా.. అక్రమంగా నిర్మించేయ్.. ఫ్లాట్లు అమ్మేయ్.. తర్వాత చేతులెత్తేయ్.. అనే పరిస్థితులకు సెక్షన్ 168 అమలుతో హైదరాబాద్‌లో చెక్ పడనుంది. అదే సమయంలో.. అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించే వ్యవస్థపైనా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో.. తెలంగాణ ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారన్నది చూడాలి.
