అందరికీ ఆహ్వానం.. నేటి నుంచి సమతాకుంభ్-2024 వేడుకలు..
శ్రీరామానుజాచార్య-108 దివ్యదేశాల ద్వితీయ బ్రహ్మోత్సవములు ఫిబ్రవరి 20 నుంచి మార్చి 1 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయని శ్రీ త్రిదండి చినజీయర్‌స్వామి తెలిపారు. ఫిబ్రవరి 20న భీష్మ ఏకాదశి సందర్భంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు జరిగే సామూహిక విష్ణు సహస్రనామ పారాయణంలో వేలాది మంది పాల్గొంటారు.

శ్రీరామానుజాచార్య-108 దివ్యదేశాల ద్వితీయ బ్రహ్మోత్సవములు ఫిబ్రవరి 20 నుంచి మార్చి 1 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయని శ్రీ త్రిదండి చినజీయర్‌స్వామి తెలిపారు. ఫిబ్రవరి 20న భీష్మ ఏకాదశి సందర్భంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు జరిగే సామూహిక విష్ణు సహస్రనామ పారాయణంలో వేలాది మంది పాల్గొంటారు. అనంతరం సమతాకుంభ్ ఉత్సవానికి అంకురార్పణ జరుగుతుందని చినజీయర్‌స్వామి అన్నారు.
21వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం ధ్యానంతో కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. తీర్థగోష్ఠి, 18 గరుడ వాహన సేవలతో పాటు 25వ తేదీన 108 కల్యాణాలు ఒకే వేదికపై ఉంటాయని, అలాగే తెప్పోత్సవంలో భాగంగా హంసవాహన సేవ ఉంటుందని తెలిపారు. భాగ్యనగరానికి సమతామూర్తిగా భగవత్ రామానుజస్వామి అవతరించి ఇది రెండో సంవత్సరం. ఎంత అద్భుతంగా శుభారంభం చేసుకున్నామో అదే ఉత్సాహంతో ఈ ఏడాది కూడా భగవంతుని కృపకు పాత్రులు కాగలరని చినజీయర్‌స్వామి కోరారు.
భగవంతుడిని స్మరించే అధికారం జాతి, కులం, లింగం, వయసుతో సంబంధం లేదని, అందరికీ సమానత్వం ఉందని చాటిచెప్పిన మహనీయుడు రామానుజులవారి వార్షికోత్సవాన్ని అందరం కలిసి జరుపుకుందామని చినజీయర్‌స్వామి పిలుపునిచ్చారు. రామానుజ కృపతో అద్భుతమైన తీర్థ, ప్రసాదాలు లభిస్తాయని.. పెద్దలు, ప్రముఖులందరికీ ఆహ్వానాలు అందించామని చెప్పారు. పార్టీలతో సంబంధం లేకుండా, ఎలాంటి హద్దులు లేకుండా ఆనందమే హద్దుగా కార్యక్రమం జరుపుకుందామంటూ చినజీయర్‌స్వామి అందరినీ సాదరంగా స్వాగతించారు.
