Success Story: ఈ పంట సాగు రైతు జీవితాన్నే మార్చేసింది.. ఎకరాకు రూ.10 లక్షల ఆదాయం..!
Success Story: ఓ పంట సాగుతో ఓ రైతు జీవితమే మారిపోయింది. ఇతర రైతులకు ఆదర్శంగా నిలిచాయి. ఈ పంట సాగుతో మూడేళ్లలో తన జీవితాన్ని మార్చుకున్నారు. ఎకరాకు రూ.10 లక్షల వరకు నికర లాభం ఆర్జిస్తూ, ఆయన విజయగాథ ఎందరో రైతులకు స్ఫూర్తినిస్తోంది. మొక్కల ఎంపిక నుండి పెంపకం, దిగుబడి వరకు పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

Success Story: ఆదాయం సంపాదించేందుకు రకరకాల మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో కూడా మంచి రాబడి పొందవచ్చు. సరైన పద్దతులను అవలంబించి పంటలను సాగు చేస్తే ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారవేత్తలకంటే ఎక్కువ సంపాదించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లా, మీరా గంజ్ బ్లాక్, సలేంపూర్ గ్రామానికి చెందిన రైతు కృష్ణ కుమార్ యాదవ్ స్ట్రాబెర్రీ సాగులో అద్భుతమైన విజయాన్ని సాధించి, ఇతర రైతులకు ఆదర్శంగా నిలిచారు. గత మూడేళ్లుగా స్ట్రాబెర్రీ సాగు చేస్తున్న ఆయన, ఒక సీజన్‌లో ఎకరాకు రూ.10 లక్షల వరకు నికర లాభాన్ని ఆర్జిస్తున్నారు. ఈ విజయగాథ వ్యవసాయంలో వినూత్న పద్ధతులను అవలంబిస్తే కలిగే ప్రయోజనాలకు నిదర్శనం.
స్ట్రాబెర్రీ సాగు చేయడం ఎలా?
కృష్ణ కుమార్ యాదవ్ స్ట్రాబెర్రీ సాగు గురించి బారాబంకిలో సునీల్ వర్మ పొలంలో చూసి తెలుసుకున్నారు. మొదట 200 మొక్కలతో ప్రయోగాత్మకంగా ప్రారంభించి మంచి ఫలితాలు రావడంతో క్రమంగా సాగు విస్తీర్ణాన్ని పెంచారు. ఈ సంవత్సరం ఆయన 6,000 మొక్కలను నాటారు. స్ట్రాబెర్రీ మొక్కలను సెప్టెంబర్, అక్టోబర్ లేదా నవంబర్‌లలో నాటవచ్చు. అయితే జౌన్‌పూర్ వంటి పూర్వాంచల్ ప్రాంతాలలో నవంబర్ నెలలో నాటడం ద్వారా ఉత్తమ ఫలితాలు వస్తాయని ఆయన తెలిపారు. ఒక ఎకరంలో సుమారు 18,000 నుండి 19,000 స్ట్రాబెర్రీ మొక్కలు పడతాయి.
సాగు పద్ధతులు, సంరక్షణ:
స్ట్రాబెర్రీ పండు చాలా సున్నితమైనది. మట్టితో పాడవకుండా ఉండటానికి మల్చింగ్ పద్ధతి తప్పనిసరి. సాధారణ పద్ధతుల్లో నాటడం వల్ల పండ్లు మట్టి అంటుకుని పాడైపోతాయి. మొక్కకు మొక్కకు మధ్య ఒక అడుగు దూరం, వరుసకు వరుసకు మధ్య నడిచేందుకు సరిపడా దూరం (3 అడుగుల వెడల్పు) ఉండేలా చూసుకోవాలి. నీటిపారుదల కోసం డ్రిప్ విధానం లేనివారు కాలువల ద్వారా తేమ తగ్గకుండా జాగ్రత్త వహించాలి.
పొలాన్ని సెప్టెంబర్ నెలలో సిద్ధం చేయడం ప్రారంభించాలి. భూమిలో బాగా కుళ్ళిన పశువుల ఎరువును సమృద్ధిగా వాడాలి. కృష్ణ కుమార్ యాదవ్ తన పొలంలో రెండు ట్రాలీల పశువుల ఎరువును వినియోగించారు. రసాయనిక ఎరువులకు సంబంధించి, వరి, గోధుమ పంటలలో ఉపయోగించే డీఏపీ, పొటాష్ వంటివి స్ట్రాబెర్రీ సాగులో కూడా అవసరం. యూరియాను మాత్రం అస్సలు వాడకూడదు. వాడితే మొక్కలు కాలిపోయే ప్రమాదం ఉంది. ఆయన మొత్తం పొలంలో 15 కిలోల డీఏపీని వాడారంటున్నాడు కృష్ణయాదవ్.
ఖర్చులు, దిగుబడి:
ఈ సంవత్సరం 6,000 మొక్కలు నాటడానికి మల్చింగ్, మొక్కల ఖర్చు కలిపి సుమారు రూ.80,000 నుండి రూ.85,000 వరకు అయిందని కృష్ణ కుమార్ యాదవ్ తెలిపారు. మొక్క నాటిన ఒక నెలలో పూలు రావడం ప్రారంభమై 45 నుండి 50 రోజులలో పండు పక్వానికి వచ్చి కోతకు సిద్ధంగా ఉంటుంది. సాధారణంగా ఒక మొక్క నుండి 300 నుండి 400 గ్రాముల దిగుబడి వస్తుంది. అయితే చల్లని ప్రాంతాలలో ఇది ఒక కిలో వరకు కూడా ఉండవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో 220 గ్రాముల ఎనిమిది బాక్సులు రూ.600కు అమ్ముడవుతున్నాయి.
తెగుళ్లు, రక్షణ:
స్ట్రాబెర్రీ పంటకు అనేక తెగుళ్లు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ద్వారా వాటిని నివారించవచ్చు. మొక్క నాటినప్పుడు ఫంగిసైడ్, పురుగుల మందు స్ప్రే చేయాలి. ఆ తర్వాత నెలకు లేదా రెండు నెలలకు ఒకసారి పురుగుల మందులను స్ప్రే చేయవచ్చు. పూలు వచ్చినప్పుడు టానిక్ లేదా 19-19-19 ఎన్‌పీకే (NPK) తో పాటు ఫంగిసైడ్ వాడటం చాలా ముఖ్యం.
పంటను పక్షులు, ఉడుతల నుండి రక్షించడానికి పొలం చుట్టూ నెట్టింగ్ అమర్చడం అత్యవసరం. పక్షులు పండ్లను పూర్తిగా తినకపోయినా, వాటిని కొరికి పాడుచేస్తాయి. దీని కోసం సుమారు 45 కిలోల నెట్టింగ్‌కు రూ.25,000 నుండి రూ.30,000 వరకు ఖర్చు అయింది. ఈ నెట్టింగ్ 5 నుండి 15 సంవత్సరాల వరకు మళ్లీ వాడుకోవచ్చని చెబుతున్నాడు.
రైతులకు సలహా:
కృష్ణ కుమార్ యాదవ్ ఇతర రైతులకు స్ట్రాబెర్రీ సాగును సరైన పద్దతులను అవలంబించి పెట్టి చేయమని సలహా ఇచ్చారు. పట్టుదలతో సాగు చేస్తే విజయం సాధించవచ్చని పేర్కొన్నారు. ఈ సాగు పద్ధతులు, నిబద్ధతతో కృష్ణ కుమార్ యాదవ్ జౌన్‌పూర్ జిల్లాలో సాధ్యం కాని వ్యవసాయాన్ని విజయవంతంగా చేసి చూపించి తన జీవితాన్ని మార్చుకున్నారు.
Gold Price: మహిళలకు శుభవార్త.. దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇవే!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




