Khairatabad: ఈ సారి దశ మహా విద్యా గణపతిగా ఖైరతాబాద్ వినాయకుడు.. రికార్డ్‌లకు కేరాఫ్
Khairatabad Ganesh: గణేష్ ఉత్సవాలకు భాగ్యనగరం సిద్ధమైంది. ఖైరతాబాద్ గణపయ్య రికార్డ్‌లకు కేరాఫ్‌గా మారాడు. ఈ సారి దశమహా విద్యా గణపతిగా దర్శనమివ్వబోతున్నఖైరతాబాద్ గణేశుడు.. 63 అడుగుల ఎత్తులో పూర్తి మట్టి విగ్రహంగా వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ గణనాథుడు మరికొద్ది గంటల్లో తొలి పూజలు అందుకోనున్నాడు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి

వినాయక చవితి వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల దృష్టి ఖైరతాబాద్ గణేష్ విగ్రహం వైపే ఉంటుంది. విగ్రహం ఎన్ని అడుగులు ఉంటుందో.. గణనాథుడు.. ఏ రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు.. అనే చర్చలు సాగుతుంటాయ్. అందుకు తగ్గట్లే.. ఖైరతాబాద్ గణనాథుడు.. వివిధ రూపాల్లో చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ఈ ఏడాది 63 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో పర్యావరణహితంగా పూర్తి మట్టి విగ్రహంగా ప్రపంచ రికార్డ్ సృష్టించింది. అలాగే.. ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం దశ మహా విద్యా గణపతిగా దర్శనమివ్వనున్నాడు. మంగళవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు తొలిపూజలు అందుకోనున్నాడు ఖైరతాబాద్ మహాగణపయ్య. పదకొండు రోజులపాటు భక్తుల పూజలందుకోనున్న ఈ దశ మహా విద్యా గణపతి మట్టి విగ్రహం నీటిలో కరగడానికి దాదాపు 10 గంటల సమయం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు.. ఖైరతాబాద్ విగ్రహం ఎంత ప్రత్యేకమో- ఎత్తైన గణేశుడి చేతిలో పెట్టే ప్రసాదం లడ్డూ కూడా అంతే క్రేజ్. ఈ ప్రసాదం కోసం లక్షలాది మంది భక్తులు నిమజ్జనానికి క్యూ కడుతుంటారు. కానీ.. గత పరిస్థితుల నేపథ్యంలో ప్రసాదం పంపకానికి ఫుల్‌స్టాప్ పెట్టింది ఉత్సవ కమిటీ.
ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు సుమారు ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది. 1954లో సింగరి శంకరయ్య అనే స్థానిక భక్తుడు స్థానిక ఆలయంలో ఒక అడుగు ఎత్తున్న గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి సామూహిక పూజలు చేశారు. అలా.. 2014 వరకు ప్రతి ఏటా ఒక్కో అడుగు ఎత్తు పెంచుతూ విగ్రహాన్ని తయారు చేశారు. 2019లో 61 అడుగుల ఎత్తున్న గణపతిని తయారు చేయగా.. భారతదేశంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా రికార్డులకెక్కింది. అప్పటినుంచి విగ్రహం ఎత్తు మళ్లీ క్రమంగా తగ్గించడం మొదలు పెట్టారు ఉత్సవ కమిటీ నిర్వహకులు. హుస్సేన్ సాగర్ మార్గంలో ఆంక్షలు, పర్యావరణ సమస్యలతో ఎత్తు తగ్గిస్తూ వస్తున్నారు. దాంతోపాటు.. ప్లాస్టర్ ఆఫ్ ఫారిస్ విగ్రహానికి గుడ్ బై చెప్పి.. మట్టి గణపయ్యకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే.. ఈ సారి పూర్తి మట్టితో 63 అడుగుల అత్యంత ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రపంచ రికార్డ్ నెలకొల్పారు.
ఇక.. ఖైరతాబాద్ మట్టి గణపయ్య విగ్రహం కోసం దాదాపు 120 మంది కళాకారులు మూడు నెలలపాటు శ్రమించారు. తమిళ శిల్పి చిన్న స్వామి రాజేంద్రన్ నేతృత్వంలో.. గత మూడు దశాబ్దాలుగా ఖైరతాబాద్ గణపతి విగ్రహాలను తయారు చేస్తున్నారు శిల్పులు. మొత్తంగా.. ఘనమైన చరిత్ర కలిగిన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొంటారు భక్తులు. ఈ క్రమంలోనే.. ప్రతీ ఏడాది ఖైరతాబాద్ గణపయ్యకు భక్తుల తాకిడి పెరుగుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం
