బర్త్‌డే పార్టీ కోసం అపార్ట్‌మెంట్‌లో పార్టీ ఏర్పాటు చేశారు.. అమ్మాయిలను తీసుకువచ్చి హంగామా చేశారు.. ఇంతలోనే పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో అసలు మ్యాటర్ వెలుగులోకి వచ్చింది.. హైదరాబాద్ నగరంలో మరోసారి రేవ్ పార్టీ కలకలం రేపింది.. మాదాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేసిన రేవ్ పార్టీని టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం భగ్నం చేశారు. 14 మంది యువకులు, ఆరుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. మిగిలిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఇందులో కొందరు డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రేవ్ పార్టీలో ఒక గ్రాము కొకైన్, రెండు గ్రాముల ఎండీఎంఏ, మత్తు పదార్థాలను, ఇన్నోవా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మొత్తం లక్ష 25వేలు విలువ చేసే మద్యం, డ్రగ్స్ సీజ్ చేశారు.
బేగంపేటకు చెందిన నాగరాజు పుట్టిన రోజు సందర్భంగా ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈవెంట్ ప్రమోటర్ కిషోర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బేగంపేట ప్రాంతానికి చెందిన రియల్టర్ నాగరాజు, సాయి కుమార్, బీటెక్ విద్యార్థులు పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమోటర్ తోపాటు పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..