వివాదాలకు చిరునామా రాజాసింగ్.! బీజేపీ ఎమ్మెల్యే రాజకీయ ప్రస్థానం ఇదే..

Raja Singh Telangana Election 2023: హైదరాబాద్‌లోని గోషామహల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న టి. రాజాసింగ్ ఎలప్పుడూ తన పదునైన వ్యాఖ్యలతో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. 2009లో తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు రాజాసింగ్. ఆయన 2014 వరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు మంగళ్‌హాట్ ప్రతినిధిగా సేవలు అందించారు.

వివాదాలకు చిరునామా రాజాసింగ్.!  బీజేపీ ఎమ్మెల్యే రాజకీయ ప్రస్థానం ఇదే..
MLA Raja Singh

Updated on: Dec 02, 2023 | 10:11 AM

Raja Singh Telangana Election 2023: హైదరాబాద్‌లోని గోషామహల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న టి. రాజాసింగ్ ఎలప్పుడూ తన పదునైన వ్యాఖ్యలతో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. 2009లో తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు రాజాసింగ్. ఆయన 2014 వరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు మంగళ్‌హాట్ ప్రతినిధిగా సేవలు అందించారు. 2014లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన రాజాసింగ్.. గోషామహల్ నుంచి పోటీలోకి దిగి.. సమీప అభ్యర్ధి ముఖేష్ గౌడ్‌పై 46,793 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2018లో కూడా అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్ధి ప్రేమ్ సింగ్ రాథోడ్‌పై 17,734 ఓట్ల తేడాతో మళ్లీ తెలంగాణ శాసనసభకు ఎన్నికయ్యారు రాజాసింగ్. అలాగే తెలంగాణ బీజేపీకి విప్‌గా కూడా పని చేశారు రాజా సింగ్. పాతబస్తీలోని గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్న లోధా వర్గానికి చెందిన వ్యక్తి రాజా సింగ్.. ఎప్పుడూ ఏదొక కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గానే నిలిచేవారు. ఇక ఏడాది పాటు రాజాసింగ్‌పై ఉన్న సస్పెన్షన్‌ను బీజేపీ దసరా ముందుగా ఎత్తివేసింది. అలాగే ఆ పార్టీ మొదటి లిస్టు అభ్యర్ధుల్లో గోషామహల్ నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా రాజాసింగ్ పోటీలో ఉన్నట్టు పేర్కొంది. తాజాగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ తరపున నామినేషన్ వేశారు. ఈ క్రమంలోనే ఆయన అఫిడివేట్‌లో జత చేసిన చరాస్తుల విలువ.. 2018తో పోలిస్తే భారీగా పెరిగింది. అప్పుడు రాజాసింగ్ చరాస్తుల విలువ రూ. 87 లక్షలు ఉండగా.. ఇప్పుడు ఏకంగా రూ. 2.29 కోట్లకు పెరిగింది.

వివాదాలు.. సస్పెన్షన్లు..

2017లో, రాజాసింగ్ హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీ ప్రాంతాన్ని “మినీ పాకిస్థాన్”తో పోలుస్తూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో పాటు పలు విద్వేషపూరిత ప్రసంగాలు ఆయన్ని చిక్కుల్లోకి నెట్టాయి. జూన్ 2018లో, రాజాసింగ్ ఖురాన్ నిషేధానికి పిలుపునిచ్చారు. ఆయన తన వ్యాఖ్యల ద్వారా ముస్లిం వ్యతిరేకనని పదేపదే చెబుతూ వచ్చిన సందర్భాలు లేకపోలేదు. ముస్లింలను దేశద్రోహులుగా పిలవడమే కాదు.. రోహింగ్యా ప్రజలపై కాల్పులకు మద్దతు ఇవ్వడం లాంటివి పెద్ద దుమారానికి దారి తీశాయి. 2023లో శివజయంతి సందర్భంగా, అహల్యనగర్ జిల్లాలోని శ్రీరామ్‌పూర్‌లో రాజాసింగ్ ముస్లింలకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు అల్లర్లకు దారితీశాయి. 2020 సెప్టెంబర్ 2న, ఫేస్‌బుక్ సంస్థ రాజాసింగ్ అకౌంట్లన్నింటినీ బ్యాన్ చేసింది. అలాగే 2022, ఆగష్టు 23న రాజాసింగ్ చేసిన మహమ్మద్ వ్యాఖ్యల వివాదం హైదరాబాద్ నగరంలో నిరసనలకు దారి తీసింది. ఆ వెంటనే హైదరాబాద్ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. దీంతో బీజేపీ.. ఆయనను పార్టీ నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ సస్పెండ్ చేసింది. మరోవైపు 27 అక్టోబర్ 2022న, రాజాసింగ్‌పై 101 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, వాటిలో 18 మతపరమైన నేరాలకు సంబంధించినవని హైదరాబాద్ పోలీసులు పేర్కొన్నారు. ఇక తాజాగా అక్టోబర్ 2023లో రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ను ఎత్తివేసిన బీజేపీ.. ఆయన్ని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నుంచి పోటీలో ఉంచింది.

ప్రజలకు కృతజ్ఞతలు..

పోలింగ్ అనంతరం గోషామహల్ ప్రజలకు బీజేపీ నేత రాజాసింగ్ తెలిపారు. అలాగే ఈ ఎన్నికల బీజేపీ పార్టీ అధికారం చేపట్టడం పక్కా అని అన్నారు రాజాసింగ్.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ ఎన్నికల వార్తల కోసం..