SCR: రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. చిల్లర సమస్యకు చెక్‌..

|

Aug 14, 2024 | 5:47 PM

రైల్వే ప్రయాణికులకు సేవలను మరింత మెరుగుపరిచే దిశగా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్లు కొనుగోలు చేసే సమయంలో నగదు చెల్లింపులకు తావు లేకుండా క్యూఆర్‌ కోడ్‌ ద్వారా టెకెట్లు కొనుగోలు చేసే సౌకర్యం కల్పిస్తున్నారు. తొలిదశలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే లోని కొన్ని ప్రధాన స్టేషన్లలో ప్రవేశపెట్టిన సౌకర్యాన్ని...

SCR: రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. చిల్లర సమస్యకు చెక్‌..
SCR
Follow us on

రైల్వే ప్రయాణికులకు సేవలను మరింత మెరుగుపరిచే దిశగా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్లు కొనుగోలు చేసే సమయంలో నగదు చెల్లింపులకు తావు లేకుండా క్యూఆర్‌ కోడ్‌ ద్వారా టెకెట్లు కొనుగోలు చేసే సౌకర్యం కల్పిస్తున్నారు. తొలిదశలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే లోని కొన్ని ప్రధాన స్టేషన్లలో ప్రవేశపెట్టిన సౌకర్యాన్ని ఇప్పుడు జోన్‌లోని అన్ని స్టేషన్‌లకు విస్తరించనున్నారు.

దక్షిణ మధ్య రైల్వే వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరచుకోవడంతో పాటు నగదు లావాదేవీలను తగ్గించడానికి డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగానే జనరల్ బుకింగ్ అండ్‌ రిజర్వేషన్ కౌంటర్లలో డిజిటల్ చెల్లింపులను పెంచడానికి, దక్షిణ మధ్య రైల్వే టిక్కెట్ల కొనుగోలు కోసం క్యూఆర్ (క్విక్ రెస్పాన్స్) కోడ్ ద్వారా టిక్కెట్ ఛార్జీని చెల్లించే అదనపు సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానం ద్వారా ప్రయాణికులు టికెట్‌ కొనుగోలు చేసే సమయంలో చిల్లర సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు.

ఇప్పటికే జోన్‌లోని అన్ని స్టేషన్స్‌లోని టికెటింగ్ కౌంటర్లలో టిక్కెట్ విండో వెలుపల ప్రత్యేక పరికరాలు అందించారు. టిక్కెట్‌ను జారీ చేయడానికి సంబంధించిన అన్ని వివరాలను సిస్టమ్‌లోకి నమోదుచేసిన తర్వాత, చెల్లింపును అంగీకరించే ముందు, ఈ పరికరాలలో క్యూఆర్ కోడ్ డిస్‌ప్లే అవుతుంది. దీంతో ప్రయాణికులు తమ యాప్స్‌ ద్వారా స్కాన్ చేసి పే చేస్తో సరిపోతుంది. పేమెంట్ పూర్తి కాగానే వెంటనే టికెట్ జారీ చేస్తారు.

తొలి దశలో భాగంగా రైల్వే వినియోగదారులకు ఈ నగదు రహిత లావాదేవీల సౌలభ్యాన్ని ముందుగా ముఖ్యమైన స్టేషన్లలోని ప్రధాన కౌంటర్లలో అందుబాటులోకి తీసుకురాగా, ఆ తర్వాత అన్ని స్టేషన్స్‌లోని కౌంటర్లకు విస్తరించనున్నారు. కౌంటర్లలో ఏర్పాటుకు అవసరమైన పరికరాలు అన్ని స్టేషన్లకు సరఫరా చేశారు. ఇప్పటికే చాలా వరకు స్టేషన్స్‌లో వీటిని ఇన్‌స్టాల్‌ చేశారు.

ఈ విషయమై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ.. ప్రయాణికులు తమ టిక్కెట్లను కౌంటర్లలో కొనుగోలు చేసేందుకు డిజిటల్ చెల్లింపుల ఎంపికను ప్రవేశపెట్టిన కమర్షియల్ అండ్‌ టెక్నికల్ స్టాఫ్ చేస్తున్న కృషిని అభినందించారు. రైలు వినియోగదారులందరూ టిక్కెట్లను కొనుగోలు చేయడానికి ఈ క్యూఆర్ కోడ్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..