ప్రజా శాంతి పార్టీ (Praja Shanti Party) రద్దు కాలేదని, అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వివరించారు. తమ పార్టీకి ఈసీ నోటీసులు మాత్రమే ఇచ్చిందని చెప్పారు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఇచ్చిన నోటీసులకు త్వరలోనే సమాధానం పంపిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదగిరిగుట్టకు రూ.2వేల కోట్లు ఇచ్చిన సీఎం..ఏ చర్చికి రూ.2 వేలు కూడా ఇవ్వలేదని ఆక్షేపించారు. అన్ని మతాలను సమానంగా చూడడం లేదని, ప్రవర్తనలో మార్పు రావాలని కోరారు. తాను ముఖ్యమంత్రి అయితే అన్ని మతాలను సమానంగా చూసుకుంటానని.. దేవాలయాలు, చర్చిలు, మసీదులకు నిధులిస్తానని పేర్కొన్నారు. ఈనెల 25 న తాను 59 వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నందున మునుగోడులో 59 మందికి డ్రా ద్వారా పాస్‌పోర్టులు ఇప్పిస్తానని చెప్పారు. తద్వారా విదేశాల్లో ఉద్యోగాల కోసం వీసాలు తెప్పించేందుకు ప్రయత్నిస్తానని వివరించారు.
అక్టోబర్ 2న హైదరాబాద్ లో శాంతి సదస్సు నిర్వహిస్తున్నాం. సీఎం కేసీఆర్ లేఖ ఇస్తే రాష్ట్రానికి రూ.లక్ష కోట్లు తెప్పిస్తాను. బీజేపీ, టీఆర్ఎస్ లు రెండూ ఒకటే. బయట కొట్టుకున్నట్లు నటిస్తుంటాయి. వేల పాటలు రాసి పాడిన గద్దర్‌కు భారతరత్న ఇవ్వాలి. ఆయన శాంతి కోసం పాటుపడ్డారు.
– కేఏ పాల్, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు
కాగా.. కేంద్ర ఎన్నికల సంఘం దేశంలో యాక్టివ్ గా లేని ఇనాక్టివ్ (అచేతన) గా గుర్తించిన 253 రాజకీయ పార్టీల (Political Parties) రిజిస్ట్రేషన్ రద్దు చేసింది. వీటిలో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజాశాంతి పార్టీ, అఖండ్ భారత్ నేషనల్ పార్టీ, అఖిలాంధ్ర మహాదేశం, ఆలిండియా ముక్తి దళ్ పార్టీ, ప్రజా భారత్ పార్టీ, ప్రజా పార్టీ, ఆంధ్రప్రదేశ్ నవోదయ ప్రజాపార్టీ, భారత్ అభ్యుదయ పార్టీ, ఆలిండియా ముత్తహిదా ఖ్వామీ మహజ్, మన పార్టీ, నేషనలిస్టిక్ తెలంగాణ రాష్ట్ర సమితి, సురాజ్ పార్టీ లు ఉన్నాయి. కామన్ సింబల్ కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత కూడా ఈ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయకపోవడం గమనార్హం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం