Prashant Kishor: హైదరాబాద్‌లో పీకే.. రిసార్ట్‌లో వ్యూహరచన.. ఎవరి కోసం.. 

|

Mar 01, 2024 | 5:29 PM

ఎన్నికల యుద్ధాలకు స్కెచ్చేసే వ్యూహకర్త హైదరాబాద్‌లో ల్యాండ్‌ అయ్యారు. ఎన్నికలొస్తున్నాయిగా స్ట్రాటజిస్టులు వస్తుంటారు పోతుంటారంటారా.. కరెక్టే వచ్చిపోవచ్చుగానీ ఆ వ్యూహకర్త అత్యంత రహస్యంగా ఉంటున్నారు. రిసార్టులో సైలెంట్‌గా స్ట్రాటజీలకు పదునుపెడుతున్నారు. ఆ పాపులర్‌ వ్యూహకర్త ఎవరికోసం ఏ పనిమీదొచ్చారు? ఎవరి కోసం ఇదంతా చేస్తున్నారు. ఆ వ్యూహకర్తతో అంత రహస్యంగా ఏం చేయిస్తున్నారు?

Prashant Kishor: హైదరాబాద్‌లో పీకే.. రిసార్ట్‌లో వ్యూహరచన.. ఎవరి కోసం.. 
Prashant Kishor
Follow us on

ఈ పీకే అసలు అల్లాటప్పా మనిషి కాదు. అవసరమైతే కోడిగుడ్డు మీద ఈకల్ని కూడా పీకగల ఘటనాఘట సమర్థుడు. అందుకే బోలెడుమంది వ్యూహకర్తల్లో ఒకడిగా మిగిలిపోలేదు ప్రశాంత్‌కిషోర్‌. ఆయన తలుచుకుంటే తిమ్మిని బమ్మిని చేయగలడు. తన వ్యూహాలతో కష్టాల్లో ఉన్న పార్టీలను కూడా గట్టెక్కించగలడు. అందుకే ఆయన ఎంటరయ్యాడంటే ఎంగేజ్‌ చేసుకున్న పార్టీ ధీమాగా ఉంటుంది. ఆ మహానుభావుడు ఏ సలహాలిస్తాడోనని ప్రత్యర్థి పార్టీలు టెన్షన్‌ పడతాయి. దేశమంతా తన బ్రాండ్‌ పవర్‌ చూపించిన ఆ బీహారీ బాబు ఈమధ్య తెలుగురాష్ట్రాల్లో కూడా వేలుపెడుతున్నాడు. అన్ని పార్టీలకూ నేనేనంటున్నాడు.

తెలంగాణలో ఈమధ్యే అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. పార్లమెంట్‌ ఎన్నికలకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. అదే ఊపుని కొనసాగించాలన్న టార్గెట్‌తో ఉంది కాంగ్రెస్‌. పోయినచోటే వెతుక్కోవాలన్న పట్టుదలతో బీఆర్‌ఎస్‌ ప్రయత్నాలు చేస్తోంది. పెరిగిన ఓటింగ్‌ శాతంతో బీజేపీ కూడా తెలంగాణలో ఈసారి పెద్ద టార్గెట్టే పెట్టుకుంది. ఈ సమయంలో పీకే తెలంగాణలో ప్రత్యక్షమయ్యారన్న వార్తలతో ఆయన ఎవరికోసం ఎంటరయ్యారన్న చర్చ మొదలైంది. హైదరాబాద్‌ నగర శివార్లలోని ఓ రిసార్ట్‌లో కొందరు నిపుణుల బృందంతో మేథోమథనం చేస్తోందట పీకే టీమ్‌. ఎక్కడున్నామో ఏం చేస్తున్నామో ఎవరికీ తెలియకుండా నాలుగుగోడల మధ్య అత్యంత రహస్యంగా సాగుతోందట పీకే వ్యూహరచన.

వ్యూహరచనలెప్పుడూ రహస్యంగానే జరుగుతాయి. కానీ ఈసారెందుకో అత్యంత రహస్యంగా జరుగుతోందట పీకే టీం ఎక్సర్‌సైజ్‌.
హైదరాబాద్‌లో జరుగుతోంది కాబట్టి తెలంగాణ కోసమేనని అనుకోవడానికి లేదు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం అసలే హైవోల్టేజ్‌ మీదుంది. అసెంబ్లీతో పాటు పార్లమెంట్‌కు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడైతే పదిమంది దృష్టిలో పడుతుందని హైదరాబాద్‌ కేంద్రంగా వ్యూహరచన జరుగుతోందా అన్న అనుమానాలొస్తున్నాయ్‌ కొందరికి. అందుకే పీకే సార్‌ వచ్చింది తెలంగాణ పార్టీకోసమా ఆంధ్రా పార్టీకోసమా అని పొలిటికల్‌ సర్కిల్స్‌లో తెగ చర్చ జరుగుతోందట. తెలంగాణలో గతంలో కొన్నాళ్లు బీఆర్‌ఎస్‌కి వ్యూహకర్తగా ఉన్నారు ప్రశాంత్‌కిషోర్‌. ఏపీలో ప్రధాన రాజకీయ ప్రత్యర్థులైన వైసీపీ, టీడీపీ రెంటికీ పీకే టీం పనిచేసింది. అందుకే ఆయన ఎంట్రీతో ఊరకరారు మహానుభావుడు అనుకుంటున్నారంతా.

పార్టీల వ్యూహకర్తల్లో తరచూ వినిపించే ఇద్దరు ముగ్గురు ప్రశాంత్‌కిషోర్‌ శిష్యులే. ఆయన శిష్యగణంలో ఒకడైన రాబిన్‌శర్మ టీడీపీ-జనసేనకోసం పనిచేస్తున్నారు. సునీల్‌ కనుగోలు కర్నాటక, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయాలకు వ్యూహాలు రచించడంలో కీలకంగా వ్యవహరించారు. అందుకే పీకే ఇప్పుడు ఎవరికోసం పనిచేస్తున్నాడన్నది అందరికీ ఆసక్తికరంగానే ఉంది. తెలంగాణలో బీఆర్‌ఎస్‌కి వ్యతిరేక పవనాలు ఉన్నాయని ముందే ఊహించారు పీకే. ఎన్నికలకు ముందు ఆ పార్టీ నాయకత్వానికి చివరి రెండువారాలు కొన్ని సలహాలిచ్చినట్లు ప్రచారం జరిగింది. పోయినేడాది డిసెంబరు మూడోవారంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. దాదాపు మూడుగంటల మీటింగ్‌ తర్వాత త్వరలోనే మళ్లీ వస్తానని చెప్పెళ్లారు పీకే. మూడ్నెల్లుగా ఆయన టీడీపీ అగ్రనేతలకు టచ్‌లో ఉన్నట్లు పార్టీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది. ఆయన ఇప్పుడు హైదరాబాద్‌ కేంద్రంగా వ్యూహరచన.. ఏపీ రాజకీయాలకోసమేనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

2019 ఎన్నికల సమయంలో వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నారు ప్రశాంత్ కిషోర్. అప్పట్లో జగన్‌ తరపున పనిచేసిన పీకేపై బీహార్‌ డెకాయిట్‌ అంటూ తీవ్ర విమర్శలు చేశారు చంద్రబాబు. తర్వాత టీడీపీ తమకోసం పనిచేయాలని కోరినా తిరస్కరించినట్లు స్వయానా పీకేనే చెప్పుకొచ్చారు. ఎంతమంది పీకేలను పెట్టుకున్నా, సీఎం జగన్‌ని పీకేదేం లేదని ఆ మధ్య మాజీ మంత్రి కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పీకే బుర్రలో గుజ్జంతా అయిపోయిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని. దీంతో ఇప్పుడు పీకే ఎంట్రీ ఎవరికోసమన్న ఆసక్తి అందరిలో ఉంది. సొంత పార్టీ పెట్టి బీహార్‌ ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటున్న పీకే.. అంతుపట్టని వ్యూహాలతో తెలుగురాష్ట్రాల్లో హల్‌చల్‌ చేస్తున్నారిప్పుడు. ఎవరికోసం పనిచేస్తున్నారోగానీ.. ఆయన రిసార్ట్‌లో స్టే చేశారన్న వార్తయితే తెలుగురాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడో ఇంట్రస్టింగ్‌ ఇష్యూ.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…