
Biscuits
దగా.. దగా.. కలికాలంలో కల్తీ కాటు. మార్కెట్‌ను ముంచేస్తోన్న నకిలీ ప్రాడక్ట్స్..కల్తీ సరుకులు. ప్రజారోగ్యానికి తూట్లు పొడిచేలా జనవాసాల మధ్యే కల్తీకాండ జరుగుతుంది.
మొన్నటికి మొన్న తెరపైకి నకిలీ ఐస్‌క్రిములు తయారీ బాగోతం వెలుగుచూసింది. అత్తాపూర్‌లో ఫేక్ ఐస్‌క్రీమ్ కార్ఖానా కూడా బయటపడింది. లేటెస్ట్‌గా అల్లాపూర్‌లో కల్తీ బిస్కెట్ బాగోతం విస్మయానికి గురి చేసింది. ఒవవైపు చెత్త.. ఆపక్కనే చెత్త చెత్తగా బిస్కెట్ల తయారీ. ఇది జరుగుతున్న వ్యవహారం.
అక్కడి పరిసరాలను చూస్తేనే ఎవరికైనా కడుపులో డోకు వస్తుంది. అక్కడే ఎంచక్కా బిస్కెట్లు తయారు చేస్తున్నారు. వీటినే బేకరీలకు షాప్‌లకు సప్లయ్ చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ మాత్రం దేవుడెరుగు.. పర్మిషన్ లేదు. పరిశుభ్రత లేదు. అంతేకాదు పిల్లలు పెద్దలు తినే బిస్కెట్లలో టేస్ట్ కోసం ప్రమాదకర రసాయనాలు వాడుతున్నారు. కల్తీదందాపై సైబరాబాద్ పోలీసులు ఉక్కపాదం మోపుతున్నారు. రీసెంట్ గా నకిలీ చాక్లెట్, ఐస్‌క్రీమ్ డెన్‌లపై మెరుపు దాడులు చేశారు. ఆ క్రమంలో పక్కా సమాచారంతో అల్లాపూర్‌లోని బ్రెడ్ టోస్ట్ కార్ఖానాలపై ఫోకస్ పెట్టారు. జాయింట్ ఆపరేషన్ చేపట్టిన బాలానగర్, అల్లాపూర్ పోలీసులు బిస్కెట్ మాఫియా బెండు తీశారు.
ఎలాంటి అనుమతులు లేకుండా ఈ పరిశ్రమ నడుపుతున్నారు. పైగా కనీస శుభ్రత పాటించడం లేదని తేలింది. పెద్ద ఎత్తున కల్తీ బిస్కెట్లను సీజ్ చేసి.. ఆ ఫ్యాక్టరీ ఓనర్‌ని అరెస్ట్ చేశారు పోలీసులు. అదీ సంగతి. చాయ్ పే చర్చలో బిస్కెట్ ఆర్డరిస్తే ..పొరపాటునో గ్రహపాటునో ఇట్టాంటి బిస్కెట్లను తింటే .. లైఫ్‌కు రిస్క్ తప్పదు. దొరికితే దొంగ. దొరకని దొంగలు ఇంకెందరో. ఇలాంటి కల్తీ కేటుగాళ్లకు కళ్లెం వేయడం పోలీసుల విధి మాత్రమే కాదు ప్రతి ఒక్కరి బాధ్యత కూడా.