
ఆయన సంకల్పం గొప్పది.. అందుకే దివ్యాంగుడైనా పట్టువదలని విక్రమార్కుడిలా ఆశయం కోసం ముందడుగు వేశారు.. చిత్రకారుడైన ఆయన.. భ్రూణ హత్యల నివారణకు తన వంతు ప్రయత్నాన్ని మొదలుపెట్టారు.. సేవ్ ది గర్ల్ ఛైల్డ్ లోగోతో ప్రముఖుల చిత్రాలను స్వయంగా రూపొందించి.. వారిని కలిసి సమాజంలో పెనవేసుకున్న భ్రూణ హత్యల నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరిస్తారు.. దీనిలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిసేందుకు ఆయన చిత్రపటంతో వందలాది కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేపట్టారు. చివరకు శుక్రవారం ప్రగతి భవన్ కు చేరుకోగా ఆయనకు.. అపూర్వ స్వాగతం లభించింది. వివరాలు.. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన చిత్రకారుడు తుపాకుల రామాంజనేయ రెడ్డి సైకిల్ యాత్ర చేపట్టి.. ప్రొద్దుటూరు నుంచి హైదరాబాద్ వరకూ పయనించారు. తన మిత్రబృందంతో ఏడురోజుల క్రితం బయల్దేరిన దివ్యాంగుడైన రామాంజనేయరెడ్డి.. సీఎం కేసీఆర్ అభిమాని.. భ్రూణ హత్యలు నివారించేందుకు ఉద్యమిస్తున్న ఆయన.. ప్రముఖుల చిత్రాలను గీసి వాటిపై సేవ్ ది గర్ల్ చైల్డ్ అనే లోగోను ముద్రించి వారికి అందిస్తూ అవగాహన కల్పిస్తుంటారు. దీనిలో భాగంగా ఆయన అభిమాన నేత సీఎం కేసీఆర్ చిత్రాన్ని గీసి ఆయనకు బహుకరించేందుకు శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు.
CM KCR Picture
ప్రగతిభవన్ చేరుకున్న రామాంజనేయ రెడ్డిని.. ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ పట్ల రామాంజనేయ రెడ్డికి ఉన్న అభిమానాన్ని తెలుసుకొని కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ బిజీగా ఉండటంతో.. రామాంజనేయరెడ్డి బృందం తీసుకొచ్చిన చిత్రాలను మంత్రి కేటీఆర్ స్వీకరించారు. ఈ సందర్భంగా రామాంజనేయరెడ్డి కృషిని అభినందించారు. రామాంజనేయరెడ్డి గంటికోట మట్టితో 20 రోజుల పాటు కష్టపడి కాన్వాస్ మీద ఆక్రిలిక్ తో, మోనో కలర్‌లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రాలను స్వయంగా రూపొందించారు.
Minister KTR
కడప జిల్లా ముద్దనూరు మండలం చిన్న దుద్యాలలో తుపాకుల రామాంజనేయరెడ్డి జన్మించారు. చిన్న వయసులోనే పోలియో సోకింది.. పేదరికం కావడంతో కూలి పనులు చేసుకొంటూ కొంతకాలం గడిపిన రామాంజనేయ రెడ్డి.. ఆర్టిస్టు కావాలన్న సంకల్పాన్ని మాత్రం వదలకుండా పెయింటింగ్ నేర్చుకుని, పెద్ద ఆర్టిస్టు అయ్యారు. సమాజంలో ఆడపిల్లలపై వివక్షను చూసి చలించిపోయారు. భ్రూణ హత్యల నివారణ కోసం ఉద్యమిస్తున్నారు. తన లక్ష్యం ప్రతిఫలించేలా కొన్ని వందల చిత్రాలు రూపొందించి, ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నారు. ఇదేబాటలో ఆయన తన భార్యను కూడా ఉన్నత చదువులు చదివించి.. ఎంఆర్ఓ ఉద్యోగం వచ్చేలా ప్రోత్సహించారు. కూతురును ఖగోళ శాస్త్రవేత్తను చేయించాలన్న సంకల్పంతో ఉన్నత చదువులు చదివిస్తున్నారు. వివిధ రంగాల్లోని ప్రముఖుల చిత్రాలు గీసి వాటిపై ‘సేవ్ గర్ల్ చైల్డ్’ లోగో వేసి వారికి అందజేస్తూ భ్రూణ హత్యలు, ఆడపిల్లల వివక్షపై.. విశేష ప్రచారం చేస్తూ సమాజంలో మార్పునకు నాందిపలుకుతున్నారు. తెలంగాణలో ఆడబిడ్డల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితుడైన రామాంజనేయరెడ్డి.. ఈ విధంగా అభిమానాన్ని చాటుకున్నారు.
Minister KTR
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..