సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తమ క్రియేటివిటీకి పదునుపెట్టి.. అమాయక ప్రజల నుంచి డబ్బులను దోచేస్తున్నారు. తాజాగా ఫెడెక్స్ కొరియర్ పేరుతో ఓ వ్యాపారిని బెదిరించి.. సుమారు రూ. 98 లక్షలను దోచేశారు సైబర్ నేరగాళ్లు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారిని కేంద్ర దర్యాప్తు సంస్థ నుంచి కాల్ చేస్తున్నామంటూ డబ్బులు కాజేశారు సైబర్ క్రిమినల్స్. ‘ఫెడెక్స్ కొరియర్ ద్వారా మీ పేరు మీద పార్శిల్ వచ్చిందని.. అందులో మత్తు మందులు ఉన్నాయని’ సదరు వ్యాపారస్తుడిని బెదిరించారు నిందితులు. తాము చెప్పిన బ్యాంక్ ఖాతాకు కోటి రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేయాలని హెచ్చరించారు. దీంతో చేసేదేమిలేక రూ. 98 లక్షలు బదిలీ చేశాడు సదరు వ్యాపారి.
అయితే కొద్దిసేపటికే అనుమానమొచ్చి సైబర్ క్రైమ్ కాల్ సెంటర్ నెంబర్ 1930కి బాధితుడు కాల్ చేసి ఫిర్యాదు ఇచ్చాడు. వెంటనే అప్రమత్తమైన సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుల బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు. కానీ సైబర్ నేరగాళ్లు క్షణాల్లో ఆ డబ్బు 11 బ్యాంకాక్ ఖాతాలకు ట్రాన్స్‌ఫర్ చేయడం గమనార్హం. సుమారు 83 లక్షల నగదు పోలీసులు ఫ్రీజ్ చేయగా.. ఈలోగానే రూ. 15 లక్షలు విత్‌డ్రా చేశారు సైబర్ కేటుగాళ్లు. కాగా, ఒక కేసులో ఇంత పెద్ద మొత్తంలో నగదు రికవరీ చేయడం ఇదే మొదటిసారి.