
దాదాపు దశాబ్దకాలం నుంచి నగర ప్రజలకు సేవలు అందిస్తోన్న పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే రహదారి మళ్లీ కొత్తరూపు సంతరించుకోనుంది. ఇవాళ్టి నుంచి పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై వన్‌వేను మాత్రమే అనుమతించనున్నారు. ఈ ఎక్స్‌ప్రెస్ వే మొదలైనప్పటి నుంచి ఉన్న బీటీ రోడ్డును తొలగించి కొత్త బీటీ రోడ్డు వేయనున్నారు. ఈ నేపథ్యంలో హెచ్ఎండీఏ (హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ)అధికారులు వన్ వే నిర్ణయం తీసుకున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి నగరానికి వచ్చే వారు ఎక్స్‌ప్రెస్ వే కింది నుంచి రావాల్సి ఉంటుంది. దాదాపు 3నెలల పాటు ఈ పనులు జరిగే అవకాశం ఉండటంతో వాహనదారులకు కొంత ఇబ్బంది ఉంటుందని హెచ్ఎండీఏ ఇంజనీరింగ్ విభాగ అధికారులు చెప్పారు.
కాగా 11.6కిలో మీటర్లు ఉన్న పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై రోడ్డు కొంతమేర దెబ్బతినడంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. 2009 అక్టోబర్ నుంచి వాహనదారులకు అందుబాటులోకి వచ్చిన ఈ ఎక్స్‌ప్రెస్ వేకు రోడ్ల మరమ్మతులు ఇప్పటివరకు చేయకపోవడం కూడా ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది. దీంతో ఎక్స్‌ప్రెస్ వేలోని పాత బీటీ రోడ్డు తొలగించి మిల్లింగ్‌తో కొత్త బీటీ రోడ్డు వేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
మళ్లింపు ఇలా:
వన్‌వే నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాద్ వచ్చే ప్రయాణికులు పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే కింది నుంచి ఆరాంఘర్, శివరాంపల్లి, పీడీపీ ఎక్స్‌రోడ్డు, ఉప్పర్‌పల్లి, హైదర్‌గూడ, అత్తాపూర్, రేతిబౌలి, మెహదీపట్నం మీదుగా రావాల్సి ఉండగా.. చంద్రాయణగుట్ట, జూపార్క్ రోడ్డు, శివరాంపల్లి నుంచి మెహదీపట్నం వచ్చే వాహనదారులు పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే కింది నుంచి శివరాంపల్లి, పీడీపీ ఎక్స్‌రోడ్డు, ఉప్పర్‌పల్లి, హైదర్‌గూడ, అత్తాపూర్, రేతిబౌలి నుంచి మెహదీపట్నానికి రావాల్సి ఉంటుంది.