
హైదరాబాద్, మార్చి 19: మూడు పువ్వులు ఆరు కాయలుగా వ్యాపారాన్ని విస్తరించుకున్న ఎంతో మంది హోటల్, రెస్టారెంట్ల యజమానులు కష్టాలను చవిచూస్తున్నారు. ఈ క్రమంలో ఓ హోటల్‌లో ఉపయోగిస్తున్న డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్‌ను అధికారులు ఎలాంటి సీజ్ రసీదు ఇవ్వకుండా స్వాధీనం చేసుకోవడం స్థానికంగా కలకలం సృష్టించింది. అసలే వ్యాపారులు కష్టాల కడలిలో మునిగిపోయి ఉన్నారంటే.. మరోవైపు అధికారుల విధానాలు మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా పరిధి బాబానగర్ ప్రాంతంలో గ్యాస్ సిలిండర్‌ను స్వాధీనం చేసుకోవడంపై జరిగిన హంగామా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ఘటనలో.. ఒక హోటల్‌లో ఉపయోగిస్తున్న డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్‌ను అధికారులు ఎలాంటి సీజ్ రసీదు ఇవ్వకుండా స్వాధీనం చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై హోటల్ యజమాని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడే నానా హంగామా చేశారు. అధికారులు సరైన విధానాన్ని పాటించకుండా చర్యలు ఎలా తీసుకుంటారని ఆ యజమాని నిలదీశారు. ఏదో ఒకటి నచ్చజెపుదామని ఆ అధికారి ప్రయత్నిస్తున్నప్పటికీ హోటల్ యజమాని ఎంతకీ మాట వినలేదు. ప్రస్తుత ప్రభుత్వ నియమాలను అనుసరించి తీసుకెళ్లే అధికారం ఉన్నప్పటికీ, రసీదు ఇవ్వకుండా ఎలా తీసుకెళ్తారని హోటల్ యజమానితో పాటు స్థానికులు సైతం రోడ్డుపైనే హంగామా మొదలెట్టారు.
సాధారణంగా వాణిజ్య అవసరాల నిమిత్తం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల వినియోగం నిషేధించబడింది. అయితే, అధికారులు స్వాధీనం చేసుకునే సమయంలో మాత్రం అధికారికంగా రసీదు ఇవ్వడం తప్పనిసరి. ఈ నియమాన్ని పాటించకుండా రసీదు లేకుండానే సిలిండర్ తీసుకెళ్లడమే ఈ వివాదానికి కారణమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న గ్యాస్ సిలిండర్లను వినియోగించి వ్యాపారం చేసుకుంటుంటే, ఇలా దౌర్జన్యంగా తీసుకెళ్లి వ్యాపారాన్ని మరింత దిగజారుస్తున్నారని అధికారితో హోటల్ యజమాని వాగ్వాదానికి దిగడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.