Hyderabad: ఆ మెగా ప్రదర్శన కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న భాగ్యనగర వాసులు.. ఈసారైనా నిర్వహించేనా?

|

Feb 20, 2021 | 2:17 PM

Hyderabad: రెండు తెలుగు రాష్ట్రాల్లో నుమాయీష్ గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఏటా భాగ్యనగరంలోని నాంపల్లి..

Hyderabad: ఆ మెగా ప్రదర్శన కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న భాగ్యనగర వాసులు.. ఈసారైనా నిర్వహించేనా?
Follow us on

Hyderabad: రెండు తెలుగు రాష్ట్రాల్లో నుమాయీష్ గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఏటా భాగ్యనగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిశ్రమల శాఖల ఆధ్వర్యంలో నుమాయీష్ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తుంటారు. అయితే, 81 ఏళ్ల నుమాయీష్ ఎగ్జిబిషన్ చరిత్రలో తొలిసారి కరోనా కారణంగా గతేడాది ఈ ఎగ్జిబిషన్‌ను నిలిపివేయడం జరిగింది. మరి ఈ ఏడాదైనా ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తారా? లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. నుమాయీష్ – 2021 ఎగ్జిబిషన్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతులు రావాల్సి ఉంది. ఈ అనుమతుల కోసం ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ సొసైటీ ఎదురుచూస్తోంది. వాస్తవానికి జనవరి 31 నుంచే ఈ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించాలని ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వాహకులు నిర్ణయించారు. కానీ ప్రభుత్వాల నుంచి ఎలాంటి అనుమతులు లభించకపోవడంతో ఆ నిర్ణయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. కాగా, ఈసారి కూడా ఎగ్జిబిషన్‌ను నిర్వహించనట్లయితే, వ్యాపారులు, పారిశ్రమలతో పాటు, ప్రభుత్వానికి కూడా నష్టం వాటిల్లనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షులు అయిన ఈటెల రాజేందర్ నుమాయీష్ ఎగ్జిబిషన్ ఏర్పాటుపై స్పందించారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని గతేడాది నుమాయీష్ ఎగ్జిబిషన్‌ను వాయిదా వేయడం జరిగిందన్నారు. అంతే తప్ప పూర్తిగా రద్దు చేయలేదని స్పష్టం చేశారు. ఇదే అంశంపై ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధి కూడా స్పందించారు. నూమాయీష్ ఎగ్జిబిషన్‌కు సంబంధించి ఇంకా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ‘నో ఆబ్జెక్ట్’ సర్టిఫికెట్ రాలేదన్నారు. అది వచ్చిన వెంటనే నుమాయీష్ 2021 కోసం ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నట్లయితే మార్చి మొదటి లేదా రెండో వారంలో ఈ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, ఈ నుమాయీష్ ఎగ్జిబిషన్‌‌లో ప్రతి ఏటా దాదాపు 20 లక్షలకు పైగా మంది కొనుగోళ్లు సాగిస్తారు. ఇంత పెద్ద ఎగ్జిబిషన్‌ను గతేడాది నిర్వహించకపోవడం వల్ల వ్యాపారులకు, పారిశ్రామిక వేత్తలకు భారీగా నష్టం వాటిల్లందని చెప్పాలి.

మరోవైపు నుమాయీష్‌ కోసం ప్రతీ హైదరాబాదీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నుమాయీష్‌తో నగరవాసులకు ఎనలేని సంబంధం ఉంది. ప్రతి ఏటా జనవరి 1 నుంచి ఫిబ్రవరి మధ్య వరకు అంటే 45 రోజుల మెగా ఎగ్జిబిషన్‌లో నగర వాసులు తమ కుటుంబ సభ్యులతో కలిసి సందడి చేస్తారు. ఈ ఎగ్జిబిషన్‌లో షాపింగ్, ఆహారం, పిల్లల కోసం ఆటల ప్రదర్శనలు ఉంటాయి. ముఖ్యంగా దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ వ్యాపార సంస్థలు తమ స్టాల్స్‌ను ఏర్పాటు చేసి తమ ఉత్పత్తులను అమ్మకానికి పెడతాయి. అలాగే హస్తకళాకారులు, ఇతర కళాకారులు తమ ఉత్పత్తులను ఈ ఎగ్జిబిషన్‌లో విక్రయిస్తుంటారు. ప్రతి ఏటా జరిగే ఈ నుమాయీష్ ఎగ్జిబిషన్‌లో పాల్గొనేందుకు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సుమారు 2000 మంది వ్యాపారులు భాగ్యనగరానికి వస్తుంటారు. వారి ఉత్పత్తులను ఇక్కడ అమ్మకానికి పెడుతుంటారు. 45 రోజుల పాటు సాగే ఈ మెగా ప్రదర్శనలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటారు. తమకు అవసరమైన, నచ్చిన వస్తువులను కోనుగోలు చేస్తారు.

నుమాయీష్‌తో 20వేల మందికి ఉపాధి..
45 రోజులు పాటు నిర్వహించే ఈ మెగా ఇండస్ట్రియల్ ప్రదర్శన ద్వారా దేశ వ్యాప్తంగా దాదాపు 20వేల మందికి ప్రతక్ష్యంగా, పరోక్షంగా జీవనోపాధి లభిస్తుంది. అదే సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకూ ఆదాయాన్ని సమకూరుస్తుంది. అధికారిక సమాచారం ప్రకారం.. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారులు ఈ ఎగ్జిబిషన్‌లో దాదాపు 1500 స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. అలాగే దాదాపు 20 లక్షల మంది ప్రజలు ఈ ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తారు. నుమాయీష్ ఎగ్జిబిషన్ వల్ల రూ. 40 కోట్ల వ్యాపార లావాదేవీలు జరుగుతాయని తెలుస్తోంది. ఇకపోతే ఈ ఎగ్జిబిసన్ సాగినంతకాలం హైదరాబాద్‌ మెట్రోకి పండగే పండుగ అని చెప్పాలి. ఈ నుమాయీష్ కారణంగా హైదరాబాద్ మెట్రోకి కూడా విపరీతమైన ఆదాయం వస్తోంది. మెట్రో స్టేషన్ సరిగ్గా నుమాయీష్ ఎగ్జిబిషన్ జరిగే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ సమీపంలో ఉండటంతో నగర ప్రయాణికులు చాలా మంది మెట్రోను ఆశ్రయిస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మెట్రో యాజమాన్యం కూడా మెట్రో రైలు నడిపే సమయాన్ని పొడిగిస్తుంటారు.

Also read:

Uber: డ్రైవర్లను కార్మికులిగా గుర్తించాల్సిందే.. ఉబర్‌కు స్పష్టం చేసిన కోర్టు.. ఇకపై వీరికి కనీస జీతం..

11 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న రానా దగ్గుబాటి.. ఈ సందర్భంగా భార్య మిహిక బజాజ్ ఏం చేసిందో తెలుసా..