Hyderabad: ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు చాలా బలమైనది. సరైన నాయకుడిని ఎన్నుకోవడానికి ఒక అస్త్రంలాంటిది. ఒక వ్యవస్థకు ప్రజా ప్రతినిధి ఎంత అవసరమో, ఆ ప్రజా ప్రతినిధిని ఎన్నుకునేందుకు ఓటు అంతే అవసరం. అందుకే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఓటరుకార్డులో ఏవైనా తప్పులు ఉంటే సరిచేసుకోవాలి. ఇందుకోసం ఎలక్షన్ కమిషన్ ఈ నెల 27, 28వ తేదీలలో ఓటరు జాబితా సవరణ ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. ఈ అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ తెలిపారు.
జనవరి1, 2022 నాటికి 18 సంవత్సరాల వయస్సు పూర్తయిన వారు నూతన ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. 2021 సంవత్సరపు ముసాయిదా ఓటరు జాబితాను భారత ఎన్నికల సంఘం నవంబర్ 1వ తేదీన విడుదల చేసింది. ఈ జాబితాలో పేరు మార్పు, అడ్రస్ మార్పు, తదితర మార్పులు, చేర్పులు ఈ ప్రత్యేక క్యాంపెయిన్ సందర్భంగా చేసుకోవచ్చని తెలిపారు. ఇందుకోసం మీ సమీప పోలింగ్ బూత్ లో ఉదయం10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బూత్ స్థాయి అధికారి అందుబాటులో ఉంటారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు
.
నూతన ఓటరు నమోదుకు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవలన్నారు. ఓటరు జాబితాలో పేరు తొలగింపునకు ఫారం-7, తప్పుల సవరణకు ఫారం-8, ఒకే నియోజక వర్గంలో మార్పుకు ఫారం-8A ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఓటు పౌరుడి అస్తిత్వానికి ప్రతీక. ప్రపంచ స్థితి, గతులను మార్చే శక్తి ఓటుకు ఉన్నది. రాష్ట్రం అభివృద్ధి చెందాలి, సమాజం పురోగతి సాధించాలి, మనం బాగుపడాలి అనే తాపత్రయం ఉండడమే కాదు ఓటూ ముఖ్యమే. అందుకే భారత ప్రజాస్వామ్య పరిరక్షణకోసం ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని గుర్తించి ఓటు వేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జి హెచ్‌ఎంసీ కమిషనర్ తెలిపారు.