Free Medical Hospital: అది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.. అలాంటి దవాఖానలో డాక్టర్ నాడిపట్టాలంటే ముందుగా క్యాష్ కౌంటర్లో డబ్బులు జమ చేయాల్సిన అవసరం లేదు. అయినా డాక్టర్ అపాయింట్ మెంట్ దొరుకుతుంది. ఎలాగో ఈ స్టోరీ చదవండి..
క్యాష్ కౌంటర్ లేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉందంటే ఎవరైనా నమ్మగలరా? అవును క్యాష్ కౌంటర్ లేని ఓ దవాఖానా మన హైదరాబాద్ నగరంలోనే ఉంది. అక్కడ రూపాయి ఆశించకుండా వైద్యసేవలు అందిస్తున్నారు. పైసా ఖర్చు లేకుండా ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలందిస్తున్న ఆ హాస్పిటల్ పేరు షాదాన్ హాస్పిటల్. పేదరోగులకు ఆరోగ్య భాగ్యాన్ని అందిస్తోంది. కులమతాల బేధభావం లేకుండా వైద్యం, మందులు, పరీక్షలు ఇలా అన్నీ ఉచితంగానే అందిస్తున్నారు. హిమాయత్ సాగర్ రోడ్డులోని షాదాన్ హాస్పిటల్లో ‘డాక్టర్ విజారత్ రసూల్ ఖాన్ ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్’ పేరిట నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభిస్తోంది. హైదరాబాద్ పాతబస్తీ, చుట్టుపక్కల శివారు జిల్లాల నుంచి పలురకాల రోగులు వైద్యం కోసం తరలి వస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఉచిత రవాణా సౌకర్యమూ కల్పించారు.
ఈ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్, చర్మ, కంటి, పంటి ఇలా అన్ని రకాల రోగాలకు ఉచిత వైద్యం అందిస్తున్నారు ఆసుపత్రి నిర్వాహకులు. అందరికీ ఆధునాతన వైద్యం అందించి రోగుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల వారికి రవాణా సౌకర్యం, భోజనమూ ఉచితంగా అందిస్తున్నారు. ఎమ్మారై, సీటీస్కాన్, 2డీ ఎకో, అన్ని రకాల వైద్య పరీక్షలు ఫ్రీగా అందిస్తున్నారు. మేజర్, మైనర్ సర్జరీలు, చెవి, ముక్కు గొంతు, ఆర్దోపెడిక్, గైనిక్ సర్జరీలన్నీ ఉచితంగానే చేస్తున్నారు. చిన్న చిన్న రోగాలకే రోగుల నుంచి లక్షల్లో ముక్కు పిండి డబ్బు వసూలు చేస్తున్న ఆసుపత్రులన్న ఈ రోజుల్లో షాదాన్ హాస్పిటల్ చేస్తున్న ఉచిత వైద్య సేవలు ఎంతోమంది ప్రాణాలను నిలబెడుతోంది.
రోజుకు 30 నుంచి 40 సర్జరీలు
‘‘మేం నిర్వహిస్తున్న ఈ మెగా హెల్త్ క్యాంపుకు విశేష స్పందన లభిస్తోంది. రోజుకు 12వందల మంది రోగులు చికిత్సలు పొందుతున్నారు. రోజూ 300కుపైగా ఇన్ పేషెంట్లుగా చేరుతున్నారు. ఎన్నో దీర్ఘకాలిక రోగాలకు చికిత్స పొంది ఉపశమనం పొందుతున్నారు. రోజుకు 30 నుంచి 40 సర్జరీలు చేస్తున్నాము. షాదాన్ సొసైటీ ఆధ్వర్యంలో ఎన్నో ఏళ్లుగా ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాము. ఇప్పటి వరకూ ఈ హెల్త్ క్యాంపులో 7500మంది రోగులకు ఉచిత వైద్య సేవలందించాము’’ అని షాదాన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సారిబ్ రసూల్ ఖాన్ అన్నారు.
డబ్బుపై వ్యామోహం, అత్యాశ పెరిగిపోతున్న నేటి కాలంలో ఖరీదైన వైద్యాన్ని ఫీజు తీసుకోకుండా అందించడం ఆదర్శనీయం అంటూ పలువురు యాజమాన్యాన్ని ప్రశంసిస్తున్నారు.
-నూర్ మహమ్మద్ టీవీ9 ప్రతినిధి హైదరాబాద్