Hyderabad: పైన పటారం.. లోనంతా లొటారమే.. కస్టమర్లందరినీ నట్టేట ముంచారు.. హైకోర్టు సీరియస్..
ఆకాశమంత ఎత్తులో కనిపించే హైరైజ్ బిల్డింగ్స్.. కళ్లు జిగేల్‌మనిపించే అధునాతన వసతులు... కానీ పైన పటారం లోనంతా లొటారమే. నిర్మాణానికి సంబంధించిన రూల్స్ అన్నీ బేఖాతరు. గుడ్డిగా నమ్మి కోట్లు పెట్టి ఫ్లాటు కొనుక్కుంటే తర్వాత నిలువునా మునిగినట్టే! ఈ కక్కుర్తిగాళ్లకు వంతపాడ్డానికి జీహెచ్‌ఎంసీ కూడా ఎవరెడీ!

ప్రాజెక్ట్ పేరు శ్రీముఖ్ నమిత 360 లైఫ్.. హైదరాబాద్ శేరిలింగంపల్లి పరిధిలోని ఇజ్జత్‌నగర్లో, హైటెక్ సిటీకి అతి చేరువలో 25 అంతస్తుల హైరైజ్ బిల్డింగ్. రంగురంగుల బ్రోచర్లు చూపించి, ప్రీలాంచ్ ఆఫర్ల మేజిక్‌తో ఆరేళ్లకిందటే ఫ్లాట్లన్నీ అమ్ముకున్నారు. కట్‌చేస్తే, ఈ ప్రాజెక్టుకు ఎటువంటి పర్మిషన్లు లేవని, నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని ఉత్తర్వులిచ్చింది హైకోర్టు. అంతేకాదు, అక్రమనిర్మాణానికి వంత పాడుతున్న GHMC అధికారులపై సీరియస్ అయింది.
ఎర్రం విజయ్‌కుమార్ వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, నమితా హోమ్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని గతంలోనే ఆదేశించింది. కానీ, ఉల్లంఘనలు సరిచేయకుండానే నమిత హోమ్స్‌కి రెండేళ్ల పాటు నిర్మాణ అనుమతుల్ని పునరుద్ధరించింది GHMC. నిబంధనలు పాటించకపోతే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇచ్చేది లేదంటూ సమర్థించుకుంది GHMC.
కానీ, అక్రమ నిర్మాణాన్ని కొనసాగించడానికి ఎలా అనుమతిస్తారు? ఉల్లంఘనలున్నాయని తెలిసినప్పుడే నిర్మాణాన్ని నిలిపెయ్యాలి కదా అని ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. తదుపరి విచారణ వరకు నిర్మాణపనులు జరక్కూడదని, అదేశాలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని GHMCని హెచ్చరించింది తెలంగాణ హైకోర్టు. ఇటు.. కోట్లు కుమ్మరించి ఫ్లాట్లు బుక్ చేసుకున్న కస్టమర్లు, ఆరేళ్లు దాటినా హ్యాండోవర్ చెయ్యకపోవడంతో లబోదిబోమంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




