Hyderabad: హైదరాబాద్‌లో గణనీయంగా పెరిగిన పెళ్లిళ్లు.. ఆ బిల్లే కారణమా?
యువతుల వివాహ వయస్సును 18 నుంచి 21 ఏళ్లకు పెంచుతూ కేంద్రం చట్టం చేసే యోచనలో ఉంది. మహిళా సాధికారిత కోసం ఈ చట్టాన్ని తీసుకువస్తున్నామంటోంది.
యువతుల వివాహ వయస్సును 18 నుంచి 21 ఏళ్లకు పెంచుతూ కేంద్రం చట్టం చేసే యోచనలో ఉంది. మహిళా సాధికారిత కోసం ఈ చట్టాన్ని తీసుకువస్తున్నామంటోంది. వివాహాబంధంలోకి అడుగుపెట్టే విషయంలో అమ్మాయిలు, అబ్బాయిలకు 75 ఏళ్లు ఆలస్యంగా సమానహక్కులు కల్పిస్తున్నామని స్పష్టం చేస్తోంది. ఈ చట్టంతో ఇకపై యువతీయువకులు 21ఏళ్ల వయసులో పెళ్లిపై నిర్ణయం తీసుకునే అవకాశం లభిస్తుందన్నది కేంద్రం ఆలోచన. దీనిపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ త్వరలోనే తన నిర్ణయాన్ని తెలియజేయనుంది.
వాస్తవానికి పురుషుల వివాహ వయస్సు 21 ఏళ్లుగా ఉంది. అమ్మాయిల పెళ్లి వయస్సుపై దేశవ్యాప్తంగా కేంద్రం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ నివేదిక ఆధారంగా దీన్ని కూడా 21 ఏళ్లకు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. విపక్షాలు ఇప్పటికే ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. మజ్లిస్ ఎంపీ ఓవైసీ కూడా బిల్లును వ్యతిరేకించారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ప్రకారం యువతుల స్వేచ్ఛాయుత హక్కుకు వ్యతిరేకమని విమర్శించారు. 18 ఏళ్ల అమ్మాయిలు ప్రధానమంత్రిని ఎన్నుకునే అవకాశం ఉన్నప్పుడు యువతుల వయసు వివాహ హక్కును ఎందుకు తిరస్కరిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.
కేంద్రం కొత్తగా తీసుకువస్తున్న చట్టాన్ని వక్ఫ్ బోర్డు తప్పుబడుతోంది. తల్లిదండ్రులకు పిల్లలు భారంగా మారడంతోనే వీలైనంత త్వరగా పెళ్లిళ్లు చేస్తున్నారని అంటున్నారు బోర్డు సభ్యులు. హైదరాబాద్‌లో విపరీతంగా ముస్లిం వివాహాలు పెరుగుతున్నాయి. చట్టం వస్తుందని ఒక్కో ఖాజీ 20 నుంచి 25 వివాహాలు జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఈ నెల నాలుగో తేదీన ఖాజీలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం తెలిపారు. కేంద్రం తీసుకువస్తున్న చట్టాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారు.
పురుషులతో పాటు.. మహిళల వివాహ వయసును 21 ఏళ్లకు పెంచితే స్త్రీ-పురుష సమానత్వం అటుంచితే మహిళా సాధికారతకు భంగం వాటిల్లుతుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. వీలైతే పురుషుల వివాహ కనీస వయసు కూడా 18 సంవత్సరాలకు తగ్గించాలి.. ప్రపంచంలో చాలా దేశాలు ఈ పద్ధతిని అనుసరిస్తున్నాయని సూచిస్తున్నాయి.
వయస్సు పెంపు బిల్లుతో పాటు కరోనా థర్డ్ వేవ్ భయాలు కూడా గత రెండు వారాలుగా పెళ్లిళ్లు జోరందుకోవడానికి కారణంగా తెలుస్తోంది.
Also Read..
PM Modi Punjab Tour: ‘భద్రతా లోపం’ కారణంగా పంజాబ్‌లో ప్రధాని మోడీ ర్యాలీ రద్దు..! వివరణ కోరిన హోంశాఖ