Telangana Rising Global Summit: ఒక్కరోజే రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం.. జూ ఏర్పాటుకు వంతారా ఎంఓయూ
గుజరాత్‌లోని జామ్ నగర్‌లో రిలయన్స్ సంస్థ వంతార పేరుతో అటవీ జంతువుల పరిరక్షణ కోసం అతిపెద్ద జూపార్క్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అలాంటి తరహా జూపార్క్ తెలంగాణలోనూ ఏర్పాటు చేయనున్నారు. గ్లోబల్ సమ్మిట్‌లో దీనికి సంబంధించిన ఎంవోయూ జరిగింది.

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు భారీ స్పందన వస్తోంది. ఈ సదస్సులో పారిశ్రామికవేత్తలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. అందులో భాగంగా రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ నేతృత్వంలోని వంతారా బృందం కీలక ఎంవోయూ కదుర్చుకుంది. ఫ్యూచర్ సిటీలో జూపార్క్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వంతో వంతారా డీల్ కుదుర్చుకుంది. సీఎం రేవంత్ సమక్షంలో అటవీశాఖతో వంతారా టీమ్ MOU చేసుకుంది. గుజరాత్‌లోని వంతారాలో ఉండే సదుపాయాలన్నీ ఫ్యూచర్ సిటీలో ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఫ్యూచర్ సిటీలో ఈ కొత్త జూ పార్క్ ఏర్పాటు కానుండగా.. ఈ నెలాఖరున గుజరాత్‌లో ఉన్న వంతారాని సందర్శిస్తామని సీఎం రేవంత్ తెలిపారు.
విద్యుత్ శాఖలో భారీగా పెట్టుబడులు
మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో సోమవారం పలు ఒప్పందాలు జరిగాయి. తెలంగాణ విద్యుత్ శాఖలో ఒక్క రోజే రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు జరిగాయి. పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకొచ్చాయి. భారత్ ఫ్యూచర్ సిటీలో అత్యంత అద్భుతంగా ఏర్పాటు చేసిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ తొలిరోజు సదస్సు ప్రారంభోత్సవంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు, వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు. దేశ, విదేశాల నుంచి అతిరథ మహారథులు హాజరైన ఈ సదస్సులో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ భవిష్యత్తు కోసం నిర్దేశిత లక్ష్యాలను సవివరంగా ఆవిష్కరించారు.
మైహోమ్ రూ.7 వేల కోట్ల పెట్టుబడులు
ఇక ఈ గ్లోబల్ సమ్మిట్‌లో మైహోమ్ పవర్ సంస్థ కూాడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. మైహోమ్ పవర్ సంస్థ రూ.7 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటుంది. దీని వల్ల 12,500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇంకా మరికొన్ని సంస్ధలు పెట్టుబడులు పెట్టేందుకు చర్చలు జరుపుతున్నాయి.
కష్టంగా అనిపించినా సాధిస్తాం
“తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లక్ష్యాలు కొంత కష్టంగా అనిపించవచ్చు. కానీ వాటిని సాధించగలమన్న విశ్వాసం మాకుంది. ఈ విషయంలో మా బృందానికి చెబుతున్నదేమంటే.. కష్టంగా ఉంటే దాన్ని వెంటనే చేసి చూపిద్దాం. మీరది అసాధ్యమని భావిస్తే మరికొంత గడువిస్తాను. నిన్నటికంటే ఈరోజు నాలో మరింత నమ్మకం పెరిగింది. నిన్నటి రోజున అదొక కల, ఒక ప్రణాళిక. ఇప్పుడు మీరంతా మాకు మద్దతుగా నిలిచారు. దృఢసంకల్పంతో సాగిస్తున్న మా ఈ ప్రయాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాం. మీ అందరి మద్దతు, సహకారంతో లక్ష్యాలను సాధించగలం. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం భవిష్యత్తు ప్రణాళికలతో సాగుతున్న తెలంగాణ రైజింగ్‌కు తిరుగులేదు. ఒక మంచి సంకల్పంతో వేసిన ఈ ముందడుగులో మా లక్ష్యాలను సాధించడానికి మీరంతా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నా” అని రేవంత్ అన్నారు.
