Graduate MLC Elections 2021: తెలంగాణలో గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీల నేతలు స్పీడ్ పెంచారు. తమ మాటల పదునుని పెంచారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్సీ రామ్‌చందర్ రావుపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చేశారు. ఉద్యోగులు, నిరుద్యోగుల కోసం ఆయన చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. బుధవారం నాడు అంబర్‌పేటలో రిటైర్డ్ కాలేజీ టీచర్ అసిసోయేషన్, ధన్వంతరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన టీచర్స్, ఎంప్లాయిస్ పట్టభద్రుల సమావేశానికి ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆమె బీజేపీ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో బీజేపీ నుండి గెలిచిన ఎమ్మెల్సీ రామ్‌చందర్ రావు నిరుద్యోగుల, ఉద్యోగుల విషయంలో ఏనాడు పోరాడలేదని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా రాష్ట్రానికి ఎలాంటి నిధులు తీసుకురాలేదని విమర్శించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఎంతగానో అభివృద్ధి సాధించిందన్నారు. లక్షా ముప్పై రెండు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఘనత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు. బీజేపీ నాయకుల వల్ల తెలంగాణకు ఇసుమంతైనా ప్రయోజనం లేదన్నారు. నలుగురు ఎంపీలు ఉండి కూడా తెలంగాణకు రూపాయి కూడా ప్రత్యేక నిధులు తీసుకురాలేదని ఎమ్మెల్సీ కవిత దుయ్యబట్టారు. వీటన్నింటినీ ఆలోచించి హైదరాబాద్-రంగారెడ్డి్-మహబూబ్‌నగర్ గ్రాడ్యూయెట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి వాణి దేవిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కవిత కోరారు. కాగా, ఈ కార్యక్రమంలో అంబర్‌పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీ నారగోని లక్ష్మణ రావు, ఉద్యోగుల సంఘాల నాయకుడు దేవి ప్రసాద్, ధన్వంతరి ఫౌండేషన్ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదిలాఉంటే.. రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్‌నగర్ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తికాగా, మార్చి 14వ తేదీన ఎన్నికల అధికారులు పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. మార్చి 17వ తేదీన ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. కాగా, హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్‌నగర్ స్థానం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా సురభి వాణీదేవి రంగంలోకి దిగారు. ఇదే స్థానం కోసం బీజేపీ నుంచి రామచంద్రరావు, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా ఫ్రొపెసర్ నాగేశ్వర్ పోటీ పడుతున్నారు.
Also read:
AP Corona: ఏపీలో పెరుగుతున్న కరోనా యాక్టివ్ కేసులు.. నిన్న ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?