
సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి ఏమైనా చేసేలా ఉన్నారు నేటి జనం. వికృత చేష్టలు చేస్తూ అందరిలో ప్రత్యేకంగా ఉండాలని చేస్తున్నవాళ్లు కొందరైతే ఇదిగో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా అవసరమైన కంటెంట్ గురించి కూడా వీడియోలు చేస్తున్నారు మరికొందరు. ఇది ఒక రకంగా సమాజంలో ఉన్న అపోహలను పోగొట్టేలా ఒక అవగాహన కోసం సృష్టించిన వీడియో అని చెప్పుకోవచ్చు.. ఇంతకీ ఏంటంటారా.. అయితే పూర్తి వివరాలలోకి వెళ్లాల్సిందే.
హైదరాబాద్ నగరంలోని మంగళహాట్‌లో కొందరు యువకులు కలిసి స్మశానవాటికలో కూర్చుని మద్యం సేవించారు. వీళ్లకు ఇదేం పోయేకాలం.. ఇంకెక్కడా చోటు లేదా అని మనం అనుకోవచ్చు. కానీ, ఇది ప్రజల్లో ఒక అవగాహన కల్పించడానికి ఉద్దేశించిందే. అదేంటంటే.. దెయ్యాలు అనేవి లేవు. కావాలంటే అర్ధరాత్రి స్మశానంలో కూర్చుని మందు తాగి చూపించి నిరూపిస్తామని ఇక్కడి యువకులు అనుకున్నారట. అందుకోసం తమ స్నేహితులతో కలిసి ఇంద్రానగర్ స్మశానవాటికలో మద్యం సేవించారు. దెయ్యాలు లేవని సమాజానికి చెప్పేందుకే ఇలా చేశామంటూ వీడియోను కూడా తెగ వైరల్ చేస్తున్నారు.
మొదట విన్నప్పుడు విచిత్రంగా తోచినప్పటికీ దీని వెనుక ఉద్దేశం తెలుసుకుంటే మంచి కారణంతోనే ఇలా చేశారంటూ అనిపించక మానదు. మనలో చాలామంది చాలా వాటికి భయపడిపోతాం. అందులో మరీ ముఖ్యంగా దెయ్యాలు ఉన్నాయా లేదా అనేది ఇప్పటికీ ఎప్పటికీ పెద్ద మిస్టరీనే. ఇలాంటి అపోహలు, అనుమానాలు తొలగించాలనే ఉద్దేశంతో ఈ యువకులు అంతా కలిసి తీసుకున్న నిర్ణయం సమాజానికి ఒక కనువిప్పులా మిగలనుంది. అయితే ఈ వీడియో చూసి విమర్శించినవారు కూడా లేకపోలేదు. దెయ్యాల ఉన్నాయా లేదా అంటే స్మశానానికి వెళ్లాలా.. ఆ వంకతో మద్యం సేవించాలా అని అనేవాళ్లు కూడా ఉన్నారు. ఏది ఏమైనా సమాజంలో పాతుకుపోయిన ఒక అపోహపై జనాలకు తేలిగ్గా అర్థమయ్యే రీతిలో ఈ యువకులు చేసిన పనిని మెచ్చుకోవాల్సిందే.