
చేపల కూర కోసం ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన హైదరాబాద్ నాగోల్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది. చేపల కూర ఓ యువకుడి మృతికి కారణమైంది. అతడి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. నాగోల్ మత్తుగూడ సమీపంలోని ఓ వాటర్ ప్లాంట్‌లో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దేవీరామ్(24), ముఖేశ్ కుమార్, యోగేశ్ కుమార్‌లు పని చేస్తున్నారు. అయితే ఈనెల 21న రాత్రి ముగ్గురు కలిసి మద్యం సేవించారు. రూమ్ లో చేపల కూర విషయంలో ముగ్గురి మధ్య వివాదం జరిగింది. ఆవేశంలో విచక్షణ కోల్పోయిన ముఖేశ్ కుమార్ కూరగాయలు కోసే కత్తితో దేవీరామ్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. గాయాలతో రోడ్డుపై కుప్పకూలిన దేవీరామ్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు కోల్పోయాడు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, ఈ హత్య స్థానికంగా కలకలం రేపింది. చేపల కూర కోసం హత్య చేయటమేంటని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..