Kumari Aunty: కుమార్ ఆంటీ ఎఫెక్ట్.. ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున వెలసిన ఫుడ్ స్టాల్స్

కుమారి ఆంటీ సంపాదన గురించి వార్తలు వైరల్ కావడంతో.. చాలామంది ఇప్పుడు ఫుడ్ బిజినెస్‌కు పూనుకున్నారు. తామేం తక్కువ అన్నట్లు అదే ప్రాంతాన్ని ఎంచుకున్నారు. హైదరాబాద్ రాయదుర్గం – మాదాపూర్ మధ్యలో ఉండే రోడ్డు ఫుట్ పాత్‌పై కుప్పలు తెప్పులుగా స్ట్రీట్ ఫుడ్ షాపులు వెలిశాయి. తక్కువ ధరకే నాన్ వెజ్ భోజనం అంటూ ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి.

Kumari Aunty: కుమార్ ఆంటీ ఎఫెక్ట్.. ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున వెలసిన ఫుడ్ స్టాల్స్
Street Food

Edited By: Ram Naramaneni

Updated on: Feb 08, 2024 | 3:41 PM

హైదరాబాద్, ఫిబ్రవరి 8:  కుమారి ఆంటీ ఇప్పుడు లేటెస్ట్ సెన్సేషన్. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె వీడియోలో కనిపిస్తున్నాయి. గత దశాబ్దకాలంగా ఆమె ఐటీసీ కోహినూర్ సమీపంలో ఫుడ్ స్టాల్ నిర్వహిస్తూ.. తక్కువ ధరకే వెజ్, నాన్ వెజ్ మీల్స్ అందిస్తోంది. ఫుడ్ వ్లాగర్స్ పుణ్యమా అని ఆమెకు ఇప్పుడూ బోలెడంత పాపులారిటీ పెరిగింది. అందరినీ నాన్నా, అమ్మా అంటూ పిలిచి వడ్డించే ఆవిడ శైలికి చాలామంది కనెక్ట్ అయ్యారు. ఆమె ఫుడ్ తినేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూడా భోజన ప్రియులు తరలివచ్చారు. అంతేకాదు.. 2 లివర్లు ఎక్స్ ట్రా.. మొత్తం 1000 రూపాయలు అనే వీడియో ఒకటి వైరల్ అయిపోయింది. అంత రేటా అని ఇంకొన్ని వీడియోలు వైరల్. తరువాత మరో యూట్యూబ్ వెళ్లినప్పుడు దానికి ఆవిడ ఇచ్చిన వివరణ, ఆరుగురు నాన్ వెజ్‌లో భిన్న వెరైటీలతో ఫుడ్ తినడం వల్ల.. మొత్తం కలిపి వెయ్యి రూపాయలు అనడం.. ఇలా ప్రతీదీ వైరల్ అవుతూనే వచ్చింది. జనాలు ఆమె వద్ద ఫుడ్ తినేందుకు, డిజిటల్ జర్నలిస్టులు ఆమె ఇంటర్వ్యూల కోసం ఆ ప్రాంతానికి క్యూ కట్టారు. ఇక సినిమా హీరో సందీప్ కిషన్ సైతం తన సినిమా ప్రమోషన్ కోసం అక్కడికి వచ్చారు.

ఈ పరిణామాలతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు కుమారికి చెందిన ఫుడ్ ఉండే వాహనాన్ని ఆపి కేసు పెట్టారు. దీంతో రచ్చ షురూ అయింది. కుమారి ఆంటీ షాపును పోలీసులు మూయించారు అనే వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. కుమారి షాపును కొనసాగనివ్వాలని సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ, పోలీసు శాఖలను ఆదేశించారు. అదే సమయంలో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. త్వరలో సీఎం ఆ ఫుడ్ స్టాల్‌ని విజిట్ చేస్తామన్నారంటూ ముఖ్యమంత్రి ముఖ్య పౌర సంబంధాల అధికారి బి.అయోధ్య రెడ్డి ట్వీట్ చేశారు.

కుమారి ఆంటీ సంపాదన గురించి వార్తలు వైరల్ కావడంతో.. చాలామంది ఇప్పుడు ఫుడ్ బిజినెస్‌కు పూనుకున్నారు. తామేం తక్కువ అన్నట్లు అదే ప్రాంతాన్ని ఎంచుకున్నారు. పరదాలు కట్టి.. దుకాణాలు పెట్టేశారు. హైదరాబాద్ రాయదుర్గం – మాదాపూర్ మధ్యలో ఉండే రోడ్డు ఫుట్ పాత్‌పై కుప్పలు తెప్పులుగా స్ట్రీట్ ఫుడ్ షాపులు వెలిశాయి. తక్కువ ధరకే నాన్ వెజ్ భోజనం అంటూ ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. జనాల తాకిడి బాగా పెరిగి.. ఆ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకుంది. భోజనం కోసం వచ్చిన వారు కార్లు, బైకులు అక్కడ రోడ్డు పొడవునా పార్క్ చేయడంతో.. ఆ రోడ్డుపై మధ్యాహ్న సమయంలో బాగా ట్రాఫిక్ పెరుగుతుంది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు రావడంతో పోలీసులు కూడా ఆ ప్రాంతం వైపు చూడటం లేదు. దీంతో మళ్లీ ట్రాఫిక్ కష్టాలు షురూ అయ్యాయి. ఇలా ఫుడ్ అమ్ముకునేవారిని ఇబ్బంది పెట్టకుండా, అలాగే ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని పలువురు కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ  క్లిక్ చేయండి..