Telangana: HCU భూవివాదంపై కేటీఆర్ బహిరంగ లేఖ….పర్యావరణాన్ని రక్షిద్దాం అని పిలుపు!!

ప్రస్తుతం తెలంగాణాతో పాటు దేశవ్యాప్తంగా కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. ముఖ్యంగా తెలంగాణలో ఈ వివాదం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై తెలంగాణ ప్రజలకు, విద్యార్థులకు, పర్యావరణ ప్రియులకు ఒక బహిరంగ లేఖ రాశారు.

Telangana: HCU భూవివాదంపై కేటీఆర్ బహిరంగ లేఖ....పర్యావరణాన్ని రక్షిద్దాం అని పిలుపు!!
Ktr Letter

Updated on: Apr 06, 2025 | 5:08 PM

Hyderabad: కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని రక్షించేందుకు అందరూ ఐక్యంగా నిలబడాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. తాను ఓ రాజకీయ నాయకుడిగా కాకుండా సాధారణ పౌరుడిగా, ప్రకృతి ప్రేమికుడిగా అటవీ భూములతో పాటు వన్య ప్రాణులను సంరక్షించుకునేందుకు పోరాటం కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో రాసుకొచ్చారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ముందుకొచ్చిన విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు, మేధావులు, జర్నలిస్టులకు తాను  కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పేర్కోన్నారు. 400 ఎకరాల పచ్చదనాన్ని కాపాడటానికి పోరాడదామని… కంచ గచ్చిబౌలిలోని భూములు 734 జాతుల మొక్కలు, 220 జాతుల పక్షులు, 15 జాతుల సరీసృపాలు, 10 జాతుల క్షీరదాలకు జీవనాధారం అని ఆయన రాసుకొచ్చారు.

ఈ వ్యవహారంలో తమ పోరాటం ఇంకా ముగియలేదని..తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం వారి స్వలాభం కోసం పర్యావరణ శ్రేయస్సును పణంగా పెట్టాలని చూడటం దురదృష్టకరమన్నారు. అభివృద్ధి ముసుగులో ఈ 400 ఎకరాల అటవీ భూమిలోని పచ్చని చెట్లను, అటవీ సంపదను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ఈ భూములను కాపాడుకోవడానికి శాంతియుతంగా, దృఢ నిశ్చయంతో సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమాన్ని నడిపించారని.. ..వారి ధైర్యానికి అభినందనలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. విద్యార్థులు విలాసాలను అడగడం లేదని… కేవలం అడవిని రక్షించాలని, 400 ఎకరాల పచ్చదనాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తున్నారని కేటీఆర్ తెలిపారు.

సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్న ఉద్యమాన్ని ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. విద్యార్థులను నిందించబడం, వారి ఉద్దేశాలను తప్పుపట్టడం వంటివి చేస్తోందని పేర్కొన్నారు.సెంట్రల్ యూనివర్సిటీని ఇక్కడి నుంచి వేరే చోటికి మార్చుతామంటూ విద్యార్థులను భయాందోళనకు గురిచేస్తూ.. ఈ పోరాటం వారి నుంచి దృష్టిని మళ్లించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. అడవిని కాపాడకుండా ఎకో పార్క్‌ పేరుతో భూ ఆక్రమణకు ప్రభుత్వం కుట్ర చేస్తోందననారు. ఇది కేవలం యూనివర్సిటీపై జరిగిన దాడి కాదని… ప్రజాస్వామ్య విలువలు, పర్యావరణంపై జరుగుతున్న దాడని కేటీఆర్ లేఖలో రాసుకొచ్చారు. ఈ భూములను విక్రయించే లేదా అడవులను నాశనం చేసే ప్రాజెక్టులను చేపట్టే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల పాటిస్తూ..భూముల వేలాన్ని నిలిపివేయాలన్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..