ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఆరున్నర వేల కోట్ల ఆదాయం. దెబ్బకు అంతా మారిపోయింది. హెచ్ఎండీఏ దశ.. దిశ.. తిరిగింది. కోకాపేట, బుద్వేల్ భూముల వేలంతో హెచ్ఎండీఏకు సిరుల పంట పండింది. 3వందల కోట్లతో భూములను అభివృద్ధి చేస్తే సుమారు 7వేల కోట్ల మేర ఆదాయం వచ్చింది. ఆదాయానికి సంబంధించిన లెక్కలను అధికారులు తెలిపారు.
హైదరాబాద్ కోకాపేట, బుద్వేల్‌లో రికార్డు ధర పలికిన భూములు హెచ్ఎండీఏకు కాసుల వర్షం కురిపించాయి. ఎకరం భూమి విలువ 100 కోట్లకు పైగా పలికి రికార్డు సృష్టించడంతో.. కోకాపేట, బుద్వేల్ భూముల వేలం ద్వారా హెచ్ఎండీఏకు సుమారు 7వేల కోట్ల మేర ఆదాయం వచ్చింది. కోకాపేట్, బుద్వేల్ రెండింటిలోనూ బిడ్డర్లు నిర్ణీత చెల్లింపు షెడ్యూల్‌కు అనుగుణంగా తమ చెల్లింపులను వెంటనే పూర్తి చేశారని హెచ్ఎండీఏ తెలిపింది. కోకాపేట్‌లో ఆగస్టు 3న మొత్తం 45.33 ఎకరాల్లో 7 ప్లాట్ల ఈ-వేలంలో 3 వేల 319.60 కోట్ల ఆదాయం వచ్చింది. సగటున ఒక్కో ఎకరానికి 73.23 కోట్లు పలికినట్లు హెచ్ఎండీఏ తెలిపింది. అత్యధికంగా ఒక ఎకరానికి 100 కోట్లు పలికి రికార్డు సృష్టించింది. అదే విధంగా బుద్వేల్‌లో హెచ్ఎండీఏ ఆగష్టు 10న 100.01 ఎకరాలను వేలానికి పెట్టింది. దీని ద్వారా 3వేల 625.73 కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో రెండు చోట్ల కలిపి భూముల విక్రయాల ద్వారా హెచ్‌ఎండీఏకు 6వేల 945.33 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఇక కోకాపేటలో లేఅవుట్ అభివృద్ధి కోసం హెచ్ఎండీఏ సుమారు 300 కోట్లు ఖర్చుచేసింది. అంతర్జాతీయ ప్రమాణాలతో రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, ఇతర మౌలిక వసతులను కల్పించింది. సుమారు 41 ఎకరాలను రకరకాల వసతుల కోసమే కేటాయించారు. లేఅవుట్‌లోని రోడ్లన్నీ 45 మీటర్ల వెడల్పుతో 8 లేన్ల రహదారి, 36 మీటర్ల వెడల్పుతో 6 లేన్ల రహదారుల నిర్మాణాన్ని చేపట్టారు. 10వ నెంబరు ప్లాటు రికార్డు ధర పలికి.. ఎకరం 100.75 కోట్ల ధర పలికింది. ఈ ఒక్క పదో నెంబరు ప్లాటు ద్వారానే 360 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. హైదరాబాద్ చరిత్రలో ఇదే అత్యధిక ధరగా చరిత్ర కెక్కింది. ఇక బుద్వేల్‌లోని 14 ప్లాట్లలో ఉన్న 100.01 ఎకరాలు కూడా పూర్తిగా అమ్ముడుపోయింది. ఎకరానికి గరిష్టంగా 41.75 కోట్లు ధర లభించింది. సగటున ఎకరం 36.25 కోట్ల చొప్పున విక్రయించారు. మోకిలాలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారిలో కొందరు ఇప్పటి వరకు డబ్బులు చెల్లించకపోవడానికి పలు కారణాలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. సకాలంలో బ్యాంకు రుణాలు లభించకపోవడం వల్ల కొందరు చెల్లించలేదన్నారు. బిడ్డర్ల విజ్ఞప్తులను సానుకూలంగా పరిశీలిస్తున్నట్టు తెలిపారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం..