AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఈ సంస్థలకు సీఈవోలు మన తెలుగువారే.. ఐటీ రంగంపైనే కేంద్రం ప్రత్యేక దృష్టి: కిషన్ రెడ్డి

సికింద్రాబాద్‌లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (NIELIT) సెంటర్ ను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మన ప్రాంతంలో ప్రారంభం కానుండటం.. ఈ విద్యాసంవత్సరం నుంచే శిక్షణాతరగతులు ప్రారంభం కానుండటం.. చాలా సంతోషంగా ఉందన్నారు...

Hyderabad: ఈ సంస్థలకు సీఈవోలు మన తెలుగువారే.. ఐటీ రంగంపైనే కేంద్రం ప్రత్యేక దృష్టి: కిషన్ రెడ్డి
Kisan Reddy
Subhash Goud
|

Updated on: Mar 13, 2024 | 2:56 PM

Share

సికింద్రాబాద్‌లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (NIELIT) సెంటర్ ను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మన ప్రాంతంలో ప్రారంభం కానుండటం.. ఈ విద్యాసంవత్సరం నుంచే శిక్షణాతరగతులు ప్రారంభం కానుండటం.. చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యుగం నడుస్తోందని, ఇందులో.. భారతదేశం రానున్న రోజుల్లో పూర్తిగా తన పట్టును పెంచుకుంటోందన్నారు. మన తెలుగు యువత అమెరికా, బ్రిటన్, యూరోపియన్ దేశాల్లో ఎలక్ట్రానిక్స్, ఐటీ రంగంలో సత్తాచాటుతున్నారని, ఇవాళ అంతర్జాతీయంగా ఏ పెద్ద కంపెనీ సీఈవో అయినా.. మనదేశానికి చెందినవారో.. మన భారత సంతతికి చెందినవారే ఉంటున్నారని మంత్రి గుర్తు చేశారు. ఈ రంగంలో మరింత ముందడుగు వేసేందుకు.. ప్రపంచ స్థాయిలో.. మన యువతను తీర్చదిద్దేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో ముందుకెళ్లేందుకు.. అవసరమైన రీతిలో యువతకు శిక్షణ, నైపుణ్యత అందించే లక్ష్యంతో ఈ నీలిట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.

సికింద్రాబాద్, తిరుపతిల్లో NIELIT సెంటర్ సెంటర్ ఏర్పాటుకు ఆమోదం లభించిన నెల రోజులలోపే ప్రారంభించామని, యువత సాధికారత దిశగా మా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి ఒక నిదర్శనమన్నారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ నీలిట్ సంస్థ.. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇతర అనుబంధ కోర్సులలో మెరుగైన శిక్షణను అందిస్తుంది. ఆయా రంగాలలో ఉపాధిని అన్వేషించే విద్యార్థులకు అవసరమైన నైపుణ్య శిక్షణను అందించి ఆయా కంపెనీలకు కావలసిన మానవ వనరులను అందుబాటులో ఉంచటంలో ఎన్‌ఐఈఎల్‌ఐటీ కీలకపాత్రను పోషిస్తుందన్నారు. ఐటీ ఎగుమతులలో, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులలో భారత్ ప్రతి సంవత్సరం ఎంతో అభివృద్ధిని సాధిస్తోందన్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం వలన భారత్ ను గమ్యస్థానంగా ఎంపిక చేసుకుని అనేక నూతన కంపెనీలు తమ తమ శాఖలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాయి. కాలానుగుణంగా ఈ కంపెనీలు ప్రథమశ్రేణి నగరాలలోనే కాకుండా ద్వితీయశ్రేణి నగరాలలో కూడా తమ తమ శాఖలను ఏర్పాటు చేస్తున్నాయి. అందులో భాగంగా ఆయా ప్రాంతాలలోని కంపెనీలు సంబంధిత రంగాలలో అత్యున్నతస్థాయి నైపుణ్యం కలిగిన మానవ వనరుల కోసం ఎంతగానో అన్వేషిస్తున్నాయని, రెండు తెలుగు రాష్ట్రాలలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న కంపెనీలకు ఆయా రంగాలలో అవసరమైన అత్యున్నతస్థాయి నైపుణ్య శిక్షణ కలిగిన మానవ వనరులను అందించే కేంద్రాల ఏర్పాటు కూడా ఆవశ్యకమైందన్నారు.

ఇవి కూడా చదవండి

రెండు తెలుగు రాష్ట్రాలలో వందల కొద్దీ నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఉన్నప్పటికీ, ఆయా రంగాలలో అత్యున్నతస్థాయి ప్రమాణాలతో కూడిన నైపుణ్య శిక్షణను అందించే కేంద్రాలు చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నాయని, అందుకే ఇన్ఫర్మేషన్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ టెక్నాలజీ సంబంధిత రంగాలలో అత్యున్నతస్థాయి శిక్షణ సంస్థల ఏర్పాటుకోసం కేంద్ర మంత్రి అశ్విణి వైష్ణవ్‌ను కోరగా, ఆయన వెంటనే అంగీకరించి ఏపీకి, తెలంగాణకు ఒక్కో నీలిట్ సంస్థను కేటాయించడం సంతోషంగా ఉందన్నారు.

ఈ కేంద్రం ద్వారా రాబోయే 3 సంవత్సరాల కాలంలో కనీసం 5,000 మందికి శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించడం జరుగుతోందని, తెలుగు రాష్ట్రాలలోని యువతకు, ఇంజనీరింగ్ విద్యార్థులకు, సంబంధిత రంగాలలో ముందుకు వెళ్లాలని చూస్తున్న నిరుద్యోగులకు ఈ కేంద్రాలు ఒక చక్కటి అవకాశమని సూచించారు. ఎంతో అత్యున్నతస్థాయి శిక్షణను అందించే ఈ కేంద్రాలలో శిక్షణను పూర్తి చేసుకున్న వారికి సంబంధిత కంపెనీలలో మంచి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. ఆయా రంగాలలో పరిశోధనలకు కూడా ఈ కేంద్రాలు చక్కని వేదికలుగా ఉపయోగపడతాయి. మన తెలుగు రాష్ట్రాల యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కిషన్‌రెడ్డి సూచించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి