Hyderabad: భాగ్యనగరవాసులకు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి మరో ఆర్ఓబీ, ఫ్లై ఓవర్..

|

May 30, 2022 | 6:19 PM

నగరంలో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు ఎస్ఆర్డిపి (Strategic Road Development project) పథకం ద్వారా మొదటి దశలో చేపట్టిన పనులు ఒక్కొక్కటి అందుబాటులోకి వస్తున్నాయి. 

Hyderabad: భాగ్యనగరవాసులకు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి మరో ఆర్ఓబీ, ఫ్లై ఓవర్..
Hyderabad
Follow us on

Hyderabad: హైదరాబాద్ నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. దీనిలో భాగంగా నగరం నలువైపులా రోడ్లను, ఫ్లై ఓవర్‌లను నిర్మిస్తోంది. ఇప్పటికే పలు ఫ్లై ఓవర్లను, ఆర్‌ఓబీలను ప్రారంభించిన జీహెచ్ఎంసీ మరికొన్నింటిని అందుబాటులోకి వచ్చేందుకు ప్రణాళికలు చేపట్టింది. దీనిలో భాగంగా వచ్చే నెలలో కైతలాపూర్ ఆర్.ఓ.బి, చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తుందని జీహెచ్ఎంసీ వెల్లడించింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. నగరంలో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు ఎస్ఆర్డిపి (Strategic Road Development project) పథకం ద్వారా మొదటి దశలో చేపట్టిన పనులు ఒక్కొక్కటి అందుబాటులోకి వస్తున్నాయి. ప్రతిపాదించిన మొత్తం పనులలో ఇంకా మిగిలిపోయిన, అసంపూర్తిగా ఉన్న పనులన్నింటినీ ఈ సంవత్సరం డిసెంబర్ చివరి వరకు పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇంకా పలు చోట్ల ప్రాధాన్యత గుర్తించిన పలు జంక్షన్ల వద్ద గాని ఇతర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు జిహెచ్ఎంసీ కార్యాచరణ సిద్ధం చేసింది.

వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకం ద్వారా ఇప్పటి వరకు చేపట్టిన 41 పనుల్లో 29  పనులు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో కైతలాపూర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. ఆర్ఓబి పనులు పూర్తయిన నేపథ్యంలో జూన్ నెలలో ప్రారంభించనున్నట్లు జీహెచ్ఎంసీ తెలిపింది. ఆర్ఓబీతో పాటుగా సర్వీస్ రోడ్డు, నాలా, ఫుట్ పాత్,  స్ట్రీట్ లైట్, స్టేర్  కేస్ నిర్మాణం రూ.83 కోట్ల వ్యయంతో చేపట్టారు. హైటెక్ సిటీ బోరబండ మధ్యలో 4 లైన్ల క్యారేజీ వే ను సైతం నిర్మించారు. అందులో రైల్వేశాఖ 18 కోట్లు,  భూసేకరణ 25 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజా రవాణా మెరుగుకు ఆర్ఓబిని చేపట్టారు.

కూకట్‌పల్లి – హైటెక్ సిటీ మధ్యలో సమానంగా రోడ్డు చేపట్టినందున జె.ఎన్.టి.యు,  మలేసియా సిటీ  సైబర్ టవర్స్ జంక్షన్ల వరకు ట్రాఫిక్  ప్రభావం తగ్గిస్తుంది. అంతే కాకుండా సనత్ నగర్, బాలానగర్ మీదుగా సికింద్రాబాద్ వరకు వెళ్లేందుకు 3.50 కిలో మీటర్లు తగ్గడమే కాకుండా ప్రయాణ సమయం కూడా తగ్గనుంది. రైల్వే ఓవర్ బ్రిడ్జి 675.50 మీటర్ల పొడవులో 46 మీటర్లు రైల్వే స్పాట్ ఉంది.  ద్విముఖ 16.61 మీటర్ల వెడల్పుతో 5.50 మీటర్ల సర్వీస్ రోడ్డు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఇవి కూడా చదవండి

ఎస్అర్డీపి ద్వారా చేపట్టిన 41 పనులలో 29 పనులు పూర్తి కాగా ఆర్ఓబి/ ఆర్‌యుబిలు కైతలాపూర్‌తో కలిసి మొత్తం 7 అందుబాటులోకి వచ్చాయి. ఉత్తమ్ నగర్, లాలాపేట్, తుకారాం గేట్, ఉప్పుగూడ  లెవెల్ క్రాసింగ్,  హై టెక్ సిటీ, ఆనంద్ బాగ్  ప్రాంతాల్లో అందుబాటులోకి రావడంతో మెరుగైన రవాణా వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలో చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ కూడా జూన్ నెలలో అందుబాటు లోకి వస్తుందని దీనిద్వారా ట్రాఫిక్ సమస్య మరింత తగ్గుతుందని అధికారులు తెలిపారు.