Hyderabad: అలర్ట్.. ఆ ట్యాంకర్‌లలో నీరు సురక్షితం కాదు.. జలమండలి లోగో వాడితే జైలుకే..

ఎవరు పడితే వారు.. జలమండలి అధికారిక లోగో వినియోగించడంపై.. వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) స్పందించింది.. అనధికారికంగా వినియోగిస్తే.. క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జలమండలి హెచ్చరించింది. బోర్డు లోగో దుర్వినియోగంపై ప్రకటన విడుదల చేసిన జలమండలి.. చర్యలు తప్పవని స్పష్టంచేసింది..

Hyderabad: అలర్ట్.. ఆ ట్యాంకర్‌లలో నీరు సురక్షితం కాదు.. జలమండలి లోగో వాడితే జైలుకే..
Misusing Hmwssb Logo

Updated on: Mar 27, 2026 | 5:48 PM

ఎవరు పడితే వారు.. జలమండలి అధికారిక లోగో వినియోగించడంపై.. వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) స్పందించింది.. అనధికారికంగా వినియోగిస్తే.. క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జలమండలి హెచ్చరించింది. బోర్డు లోగో దుర్వినియోగంపై ప్రకటన విడుదల చేసిన జలమండలి.. చర్యలు తప్పవని స్పష్టంచేసింది.. జలమండలి అధికారిక లోగోను కొందరు వ్యక్తులు, ముఖ్యంగా ప్రైవేట్ నీటి ట్యాంకర్ యజమానులు, అనధికారికంగా వినియోగిస్తున్నట్లు ఇటీవల జలమండలి దృష్టికి వచ్చింది. దీనిపై.. HMWSSB అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

ఈ విధమైన చర్యలు పూర్తిగా చట్ట విరుద్ధమైనవిగా పరిగణిస్తారు..

జలమండలి లోగో అనేది సంస్థ ప్రభుత్వ అధికారిక గుర్తింపు చిహ్నం. దీనిని అనుమతి లేకుండా వినియోగించడం ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించే అవకాశం ఉంది. ప్రైవేట్ ట్యాంకర్లు జలమండలి లోగోను ఉపయోగించడం వల్ల, ఆ ట్యాంకర్లు ప్రభుత్వ సేవల భాగంగా ప్రజలు భావించే పరిస్థితి ఏర్పడుతోంది. ఇది ప్రజల నమ్మకాన్ని దెబ్బతీయడమే కాకుండా, మోసపూరిత చర్యగా గుర్తిస్తారు.

ఈ నేపథ్యంలో, జలమండలి అధికారులు ఈ విషయాన్ని అత్యంత సీరియస్‌గా పరిగణించి, లోగో దుర్వినియోగం చేసే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. జలమండలి పేరు, లోగో, బ్రాండ్‌ను ఉపయోగిస్తూ కొంతమంది ప్రైవేట్ బోర్‌వెల్ ట్యాంకర్ ఆపరేటర్లు అనధికారికంగా ప్రజలకు నీరు సరఫరా చేస్తున్నట్లు బోర్డు దృష్టికి వచ్చింది.

దీనివల్ల ఆ నీరు జలమండలి ద్వారా సరఫరా చేయబడినదనే తప్పుడు భావన కలుగుతోంది. ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా సరఫరా అయ్యే నీరు సాధారణంగా బోర్‌వెల్‌ల నుండి సేకరించి.. ఈ నీరు జలమండలి ప్రమాణాల ప్రకారం శుద్ధి చేయబడినది కాదనీ.. అలాగే నాణ్యత పరీక్షలు కూడా చేయబడవు. అందువల్ల, ఈ నీటిని వినియోగించడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కలిగే ప్రమాదం ఉంది.

అందువల్ల, సాధారణ ప్రజలు ప్రైవేట్ ట్యాంకర్ ఆపరేటర్లపై ఆధారపడవద్దని జలమండలి సూచిస్తోంది. ఈ నీటి నాణ్యత సురక్షితం కాకపోవచ్చు.. ఆరోగ్యానికి హానికరమై ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ప్రజలు తాగునీటి కోసం ట్యాంకర్లను బుక్ చేసుకునే సందర్భంలో జలమండలి అధికారిక కస్టమర్ కేర్ సేవల ద్వారా మాత్రమే బుక్ చేయవలసిందిగా కోరుతుంది. టోల్ ఫ్రీ నంబర్ 155313 కు కాల్ చేసి, సురక్షితమైన, శుద్ధి చేయబడిన తాగునీటిని పొందవచ్చు.

ఇలాంటి ఘటనలు గుర్తించిన వెంటనే సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. ఇటీవల నిర్వహించిన తనిఖీలలో ఒక ప్రైవేట్ నీటి ట్యాంకర్ జలమండలి లోగోను అనధికారికంగా వినియోగిస్తున్నట్లు గుర్తించిన అధికారులు ఆ ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకుని, సంబంధిత వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.

జలమండలి పరిధిలోని అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి, లోగో దుర్వినియోగం జరుగకుండా కఠినంగా పర్యవేక్షణ చేయాలని ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా ఇలాంటి ఘటనలు గమనించినట్లయితే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.

జలమండలికి ఫిర్యాదు చేయండి..

అలాగే.. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి, జలమండలి లోగోను అనధికారికంగా వినియోగిస్తున్న ప్రైవేట్ ట్యాంకర్లు లేదా ఇతర వ్యక్తులను గుర్తిస్తే సమీప జలమండలి కార్యాలయానికి లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించవలసిందిగా కోరారు. ప్రజల సహకారం ద్వారా ఇటువంటి అక్రమ చర్యలను నిరోధించడం సాధ్యమవుతుందని, జలమండలి సేవలపై ప్రజల నమ్మకాన్ని కాపాడడం కోసం ఈ చర్యలు చేపట్టామని ఆయన అన్నారు.

భవిష్యత్తులో కూడా ఇలాంటి దుర్వినియోగాన్ని పూర్తిగా నివారించడానికి కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తామని జలమండలి స్పష్టం చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us