Telangana: హెచ్చరిక.! తెలంగాణకు వానలే వానలు.. ఈ జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు

|

Aug 31, 2024 | 7:30 PM

ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా వైపుగా కదులుతున్న వాయుగుండం తీవ్రంగా బలపడింది. ఈ వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే శనివారం రాత్రి..

Telangana: హెచ్చరిక.! తెలంగాణకు వానలే వానలు.. ఈ జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు
Hyderabad Rains
Follow us on

ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా వైపుగా కదులుతున్న వాయుగుండం తీవ్రంగా బలపడింది. ఈ వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే శనివారం రాత్రి 10 గంటల నుంచి హైదరాబాద్‌లో, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయంది. హైదరాబాద్‌ సహా తెలంగాణలో 8జిల్లాలలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది వాతావరణ శాఖ. ఆదివారం ఆదిలాబాద్, నిజామాబాద్‌, నిర్మల్, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురవనున్నాయి.

తెలంగాణలో కుండపోత వర్షానికి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో ఎడతెరిపి లేని వర్షంతో జడ్చర్ల ప్రభుత్వాస్పత్రిని వరద నీరు చుట్టుముట్టింది. ఆస్పత్రి లోపలికి వెళ్లే మార్గంలో మోకాల్లోతు నీరు చేరడంతో రోగులు, బంధువులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

నారాయణపేట జిల్లాలో కుండపోత వానతోకు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దాంతో.. ఉట్కూరు మండలం మల్లేపల్లి దగ్గర ఓ కారు వాగులో చిక్కుకుంది. ఉధృతంగా ప్రవహిస్తున్న క్రమంలో వాగు దాటేందుకు ప్రయత్నించగా.. కొట్టుకుపోయింది. అయితే.. వెంటనే అప్రమత్తమైన స్థానికులు కారులో ఉన్నవాళ్లను కాపాడారు. ఆ తర్వాత.. అతికష్టంమీద కారును ఒడ్డుకు తీసుకొచ్చారు స్థానికులు.

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎర్రుపాలెం మండలం నరసింహపురం గ్రామం దగ్గర వాగు ఉధృతి పెరగడంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి వరదలో కొట్టుకుపోయాడు. కొంచెం ముందుకు వెళ్లాక చెట్టును పట్టుకొని కేకలు వేయడంతో అక్కడున్న స్థానికులు అతడిని కాపాడారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వాగులు వంకలు ఉప్పొంగడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. త్రిపురారం మండలం బాబుసాయి పేట వద్ద భారీ వర్షానికి తాత్కాలిక బ్రిడ్జి తెగిపోయింది. త్రిపురారం నుండి కుక్కడం వెళ్ళే ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. దేవరకొండ లో ఏకధాటిగా గంటసేపు కురిసిన వర్షానికి ఉర్దూ మీడియం ప్రైమరీ స్కూల్ తరగతి గదుల్లోకి వర్షపు నీరు రావడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.