మాదాపూర్‌లో మహా మత్తు దందా..వాట్సాప్ ఆర్డర్లు.. ర్యాపిడో డెలివరీలతో..
హైదరాబాద్ ఐటీ కారిడార్ కేంద్రంగా యథేచ్ఛగా సాగుతున్న నిషేధిత ఈ-సిగరెట్లు, వేప్స్ అక్రమ విక్రయాల ముఠా గుట్టును పోలీసులు మంగళవారం రట్టు చేశారు. మాదాపూర్ మెట్రో పిల్లర్ నంబర్ 1762 సమీపంలో ఉన్న ది స్మోక్ షాప్ పై ఈగల్ టీమ్ సిబ్బంది ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో చట్టవిరుద్ధంగా నిల్వ ఉంచిన భారీ పరిమాణంలో ఈ-సిగరెట్లు, వేప్స్, పాడ్స్, కార్ట్రిడ్జ్‌లు, నికోటిన్ పౌచ్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్ ఐటీ కారిడార్ కేంద్రంగా నిషేధిత ఈ-సిగరెట్లు, వేప్స్ అక్రమంగా విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. మాదాపూర్ మెట్రో పిల్లర్ నంబర్ 1762 సమీపంలోని “ది స్మోక్ షాప్” పై ఈగల్ టీమ్ సిబ్బంది ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా నిషేధిత ఈ-సిగరెట్లు, వేప్స్, పాడ్స్, కార్ట్రిడ్జ్‌లు మరియు నికోటిన్ పౌచ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. షాప్‌లో తనిఖీలు చేపట్టి అక్కడ పని చేస్తున్న కేరళకు చెందిన అబూబకర్ సిద్దీక్ అనే ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 17 ఈ-సిగరెట్లు, ముడి పదార్థాలు, రెండు మొబైల్ ఫోన్లతో పాటు రూ.72,500 నగదును సైతం సీజ్ చేశారు.
ఈ అక్రమ వ్యాపారాన్ని ఎంతో ముందస్తు ప్రణాళికతో డిజిటల్ పద్ధతిలో నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కస్టమర్ల నుంచి ప్రధానంగా వాట్సాప్ ద్వారా ఆర్డర్లు స్వీకరించి, పేటీఎం క్యూఆర్/యుపిఐ స్కానర్ల ద్వారా ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించుకునేవారు. ఆర్డర్ ఖరారైన తర్వాత పోలీసులు లేదా ఇతరులకు అనుమానం రాకుండా ఉండేందుకు ర్యపిడో, పోర్టర్ వంటి ప్రైవేట్ డెలివరీ యాప్‌ల ద్వారా నేరుగా కస్టమర్ల ఇళ్లకు డోర్ డెలివరీ నిబంధనల ప్రకారం పంపేవారని అధికారులు గుర్తించారు. నిందితుడి మొబైల్ ఫోన్లలో దీనికి సంబంధించిన అనేక వాట్సాప్ చాట్‌లు, డెలివరీ ట్రాకింగ్ వివరాలు, ఆన్‌లైన్ పేమెంట్ ఆధారాలను సేకరించారు.
షాప్ యజమాని అబ్దుల్ సఫ్వాన్, ఉద్యోగి అబూబకర్ సిద్దీక్‌తో పాటు ఈ నిషేధిత పదార్థాలను సరఫరా చేస్తున్న ముఖ్య సూత్రధారుల పాత్రపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా కళాశాల విద్యార్థులు, మైనర్లను లక్ష్యంగా చేసుకుని ఈ వేప్స్‌ను విక్రయించారా అనే కోణంలోనూ పోలీసులు ప్రత్యేక విచారణ జరుపుతున్నారు. యువత ప్రాణాలతో చెలగాటమాడుతూ నిషేధిత ఈ-సిగరెట్లను అక్రమంగా నిల్వ చేసినా, సరఫరా చేసినా కఠిన చర్యలు తప్పవని, సైబరాబాద్ పరిధిలో ఇటువంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంటుందని పోలీసులు హెచ్చరించారు.




