వేడి నీళ్ల కోసం గీజర్ వాడుతున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం!
చలికాలంలో ప్రతి ఇంట్లో గీజర్ల వాడకం విపరీతంగా పెరుగుతుంది. అయితే, తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇవి విద్యుత్ షాక్‌లు, పేలుళ్లు లేదా గ్యాస్ లీకేజీలకు దారితీసి ప్రాణాలకే ప్రమాదకరంగా మారతాయి. స్నానం చేసే సమయంలో విద్యుత్ షాక్‌లు రాకుండా ఉండటానికి తప్పనిసరిగా గీజర్ స్విచ్ ఆఫ్ చేయాలి. గ్యాస్ గీజర్లు వాడేవారు బాత్‌రూమ్‌లో గాలి వెలుతురు సరిగ్గా ఉండేలా చూడాలి.

చలికాలం వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో వాటర్ హీటర్లు, గీజర్ల వాడకం సర్వసాధారణమైపోతుంది. ఉదయాన్నే వేడి నీటి స్నానం హాయినిచ్చినప్పటికీ, గీజర్ల వాడకంలో చిన్నపాటి నిర్లక్ష్యం వహించినా అది పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. ఈ మధ్యకాలంలో గీజర్లు పేలిపోవడం, బాత్‌రూమ్‌లలో విద్యుత్ షాక్ కొట్టడం, గ్యాస్ గీజర్ల లీకేజీ వల్ల ఊపిరాడక ఊపిరి వదిలిన సంఘటనలు తరచుగా వింటున్నాం. అందుకే గీజర్ ఉపయోగించేటప్పుడు తీసుకోవాల్సిన ముఖ్యమైన భద్రతా జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆటో కట్-ఆఫ్ స్విచ్ ఉందో లేదో చూడండి:
చాలామంది గీజర్ స్విచ్ ఆన్ చేసి మరిచిపోతుంటారు. నీరు విపరీతంగా వేడెక్కి ఆవిరి ఒత్తిడి పెరిగితే గీజర్ ట్యాంక్ పేలిపోయే ప్రమాదం ఉంది. అందుకే నీరు వేడెక్కిన వెంటనే ఆటోమేటిక్‌గా పవర్ ఆగిపోయే ఆటో కట్-ఆఫ్ సదుపాయం ఉన్న గీజర్లను మాత్రమే కొనుగోలు చేయాలి.
స్నానం చేసే ముందు స్విచ్ ఆఫ్ చేయండి:
చాలామంది చేసే అతిపెద్ద పొరపాటు గీజర్ ఆన్‌లో ఉన్నప్పుడే స్నానం చేయడం. నీటి ద్వారా విద్యుత్ ప్రసరించే అవకాశం ఉన్నందున, ఏమాత్రం వైరింగ్ లోపం ఉన్నా బాత్‌రూమ్‌లో షాక్ కొట్టే ప్రమాదం ఉంది. కాబట్టి, నీరు వేడెక్కిన వెంటనే స్విచ్ ఆఫ్ చేసి, ఆ తర్వాతే నీటిని ఉపయోగించడం సురక్షితం.
ఉష్ణోగ్రత నియంత్రణ:
గీజర్‌లో ఉష్ణోగ్రతను ఎప్పుడూ గరిష్ట స్థాయి లో ఉంచకూడదు. థర్మోస్టాట్‌ను 60 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద సెట్ చేయడం మంచిది. ఇది విద్యుత్ వినియోగాన్ని తగ్గించడమే కాకుండా, అనుకోకుండా వేడి నీరు పడి చర్మం కాలకుండా కాపాడుతుంది.
గ్యాస్ గీజర్లతో అత్యంత జాగ్రత్త!:
గ్యాస్ గీజర్లు వాడేవారు బాత్‌రూమ్‌లో ప్రాపర్ వెంటిలేషన్ Exhaust Fan లేదా కిటికీ ఉండేలా చూసుకోవాలి. ఎల్పీజీ గ్యాస్ సరిగ్గా మండనప్పుడు విడుదలయ్యే విషపూరిత కార్బన్ మోనాక్సైడ్ వాయువు వల్ల బాత్‌రూమ్‌లో ఊపిరి ఆడక స్పృహ తప్పిపోయే ప్రమాదం ఉంది.
రెగ్యులర్ సర్వీసింగ్, ఎర్థింగ్:
సంవత్సరానికి కనీసం ఒకసారైనా అర్హత కలిగిన టెక్నీషియన్‌తో గీజర్‌ను తనిఖీ చేయించాలి. ట్యాంక్‌లోని కేల్షియం పేస్ట్, హీటింగ్ ఎలిమెంట్ సరిగ్గా ఉన్నాయో లేదో చూడాలి. అలాగే బాత్‌రూమ్ విద్యుత్ కనెక్షన్‌కు సరైన ఎర్థింగ్ ఉందో లేదో నిర్ధారించుకోవాలి. సరైన జాగ్రత్తలు పాటిస్తూ గీజర్లను ఉపయోగిస్తే ప్రమాదాల బారిన పడకుండా చలికాలంలో హాయిగా, సురక్షితంగా వేడి నీటి స్నానాన్ని ఆస్వాదించవచ్చు.




