హైడ్రా వ్యవస్థ దేశవ్యాప్తంగా రావాలనే చర్చ ప్రజల్లో మొదలైందని, ఇటీవల తన బెంగళూరు టూర్లో అక్కడి స్థానికులు హైడ్రా తరహా వ్యవస్థను కోరుకుంటున్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. హైదరాబాద్ అశోక్ నగర్లోని సీఎస్‌బీ ఐఏఎస్ అకాడమిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ఏదైనా మార్పు రావాలంటే యువతతోనే సాధ్యమని పేర్కొన్నారు.
ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నించి రాకపోతే నిరుత్సాహ పడకుండా , దృఢసంకల్పంతో ప్రయత్నిస్తే విజయం సాధిస్తారన్నారు. మనం ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు, మన దేశం ఎప్పుడు అలా మారుతుందో అని అనుకుంటామని… కానీ మనం మారితే దేశం మారుతుందనే విషయాన్ని గ్రహించలేక పోతున్నామన్నారు. ప్రకృతిని కాపాడటమే లక్ష్యంగా తాము పని చేస్తున్నామని… ఇందులో కొన్ని అడ్డంకులు ఎదురైనా తమ లక్ష్యాన్ని చేరుకుంటామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అకాడమీలో నిర్వహించిన ప్రాజెక్ట్ కల్పతారు 3.0లో సెలెక్ట్ అయిన 200 మంది విద్యార్థులకు రంగనాధ్ యూపీఎస్సీ స్టడీ మెటీరియల్ అందజేశారు. మొదటి పది మందికి ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నట్లు అకాడమీ ఫౌండర్ బాలలత తెలిపారు.