తెలంగాణ చరిత్రలో కలికితురాయిలా నిలుస్తూ, తరతరాల తెలుగు జాతి చరిత్రను దశదిశలా చాటిచెప్పిన హైదరాబాద్ నగరం విశ్వనగరంగా మెరుగులద్దుకుంటోంది. యావత్ సమాజం గర్వించదగ్గ మహానగరంగా భాగ్యనగరం ప్రపంచ ఖ్యాతిని సొంతం చేసుకోబోంతోంది. అడ్డంకులు దాటేస్తూ, అవరోధాలు అధిగమిస్తూ మున్ముందుకు సాగుతోంది. ట్రాఫిక్ చిక్కుల్తో సతమతమయ్యే నగరం ఇప్పుడు ట్రాఫిక్ ఫ్రీ, సిగ్నల్ ఫ్రీ సిటీగా తనదైన అభివృద్దికి అరుదైన సాక్ష్యంగా నిలుస్తోంది.
సిగ్నల్ ఫ్రీ.. ట్రాఫిక్ ఫ్రీ.. ఇదే లక్ష్యంతో మహానగరంలో వీలైన ప్రతిచోట ఫ్లై ఓవర్లు నిర్మాణం చేస్తున్నారు. పాతబస్తీ, కొత్తబస్తీ తేడా లేదు.. ట్రాఫిక్ ఫికర్ ఉందా.. ఫ్లైఓవర్ కట్టేయ్ అంటున్నారు అధికారులు. సిటీకి నలుదిక్కుల నుంచి నడిమధ్యకు రావాలన్నా.. ఓ కొన నుంచి ఈ కొనకు వెళ్లాలన్న ఓ పెద్ద ప్రయాస. అది ఒకప్పుడు. కానీ ఇప్పడు సిగ్నల్ లు కాదు.. సింగిల్ రైడ్ తో ఫ్లైఓవర్లమీదుగా ఆగేదేలే అన్నట్లు వెహికిల్స్ దూసుకెళ్తున్నాయి.
తాజాగా చాంద్రాయణగుట్ట విస్తరణ ఫ్లైఓవర్ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నది. రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమ శాఖ మంత్రి కె.తారక రామారావు(KTR) ఈ నెల 23వ తేదీన ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. ఎస్.ఆర్.డి.పి ఫలాలు ఒక్కొక్కటి అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ప్రజల మౌలిక అవసరాలు పూర్తి చేయడంలో బల్దియా లక్ష్యం నెరవేరే అవకాశం దగ్గరలోనే ఉంది.
ఎస్.ఆర్.డి.పి ద్వారా నగరంలో నలువైపులా జిహెచ్ఎంసి ద్వారా చేపట్టిన 41 పనులలో దీంతో 30 పనులు పూర్తి అయ్యాయి. మిగతా 11 పనులు వివిధ అభివృద్ధి దశలో కలవు. దీంతో ఇప్పటి వరకు 15 ఫ్లై ఓవర్లు పూర్తయ్యాయి. రోజురోజుకు నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో గమ్యస్థానానికి సకాలంలో చేరడానికి ట్రాఫిక్ సమస్య వలన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను, సమస్యలను అధిగమించడానికి మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడం జరిగింది.
నిర్ణీత సమయంలో నిర్దేశించిన ప్రదేశానికి వెళ్లేందుకు అవసరమైన చోట ఫ్లై ఓవర్లు, అండర్ పాసులు, ఆర్. ఓ.బి లు, చేపట్టడమే కాకుండా పటిష్టమైన రోడ్డు సౌకర్యం కల్పించి సిగ్నల్ ఫ్రీ రవాణాను ఏర్పాటు చేయడం వలన ట్రాఫిక్ సమస్య చాలా మేరకు తీరిందని చెప్పవచ్చు.
చాంద్రాయణగుట్ట విస్తరణ ఫ్లై ఓవర్ వలన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఎల్బీనగర్ మీదుగా నల్గొండ, వరంగల్ వెళ్లేందుకు సులభతరమయ్యేందుకు ఈ ఫ్లైఓవర్ దోహదపడుతుంది. చాంద్రాయణగుట్ట వద్ద ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు రూ. 45 కోట్ల 87 లక్షల రూపాయల వ్యయంతో యుటిలిటీ షిఫ్టింగ్, భూసేకరణ కలిపి మొత్తం అట్టి వ్యయంతో ఫ్లై ఓవర్ ను చేపట్టారు. ఈ ఫ్లై ఓవర్ 4 లైన్లను రెండు వైపుల 674 మీటర్ల పొడవు తో నిర్మాణం చేశారు. తద్వారా కందికల్ గేట్, బర్కాస్ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ ఆగకుండా నేరుగా ఈ ఫ్లైఓవర్ పై నుండి వెళ్లవచ్చు.
ప్రస్తుతం ఉన్న ఫ్లైఓవర్ అప్రోచ్ చివరిలో ట్రాఫిక్ రద్దీ ని నివారించడానికి ఫ్లైఓవర్ ను పొడిగించడం జరిగింది. కుడి వైపున దర్గా, DLRL , ఎడమ వైపున మసీదు, మందిర్ ఉండడం మూలంగా వాహనదారుల ప్రమాదాలను నివారించడమే కాకుండా ట్రాఫిక్ రద్దీని తొలగించడానికి ఉపయోగపడుతుంది. ఈ ఫ్లై ఓవర్ రెండువైపులా నిర్మాణం చేపట్టిన నేపథ్యం ఓవైసీ జంక్షన్ మీదుగా ఎల్బీనగర్ వరకు, ఎల్బీనగర్ నుండి శంషాబాద్ వైపు వెళ్లేందుకు సకాలంలో చేరుటకు వీలవుతుంది.
ఆరాంఘర్ నుండి ఎల్బీ నగర్ మీదుగా ఉప్పల్ వరకు దీంతో ఏడు ఫ్లై ఓవర్లు, అండర్ పాసులు చేపట్టారు. ఆరాంఘర్ నుండి మీర్ ఆలం ట్యాంక్ వరకు నిర్మించే ఫ్లైఓవర్ జిహెచ్ఎంసి లోనే అతి పొడవైనది. అట్టి నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
ఫలక్ నామ ఫ్లై ఓవర్ త్వరలో అందుబాటులోకి రానున్నది. బైరమల్ గూడ కుడి, ఎడమ రెండు వైపులా, కామినేని హాస్పిటల్ వద్ద కుడి, ఎడమ రెండు వైపులా, ఎల్బీనగర్ వద్ద కుడి, ఎడమ వైపు అండర్ పాసులు అందుబాటులోకి రాగా నాగోల్ వద్ద కుడి, ఎడమ రెండు వైపులా చేపట్టిన నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి.
గంటలకొద్దీ టైం పట్టే జర్నీతో సిటీలో బండి ఎక్కాలంటేనే జనం జంకేవారు. కొత్తగా గత రెండేళ్లుగా ఒక్కోక్క ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తూ కమ్యూటర్స్ కి ఊరట నిస్తున్నాయి.