Hyderabad: నగర వాసులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి మరో ఫ్లై ఓవర్
బాచుపల్లి జంక్షన్‌లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేలా హెచ్‌ఎండీఏ నిర్మించిన ఆరు లేన్ల ఫ్లైఓవర్ సిద్ధమైంది. రూ.141 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్‌ను త్వరలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనుండగా.. మియాపూర్, నిజాంపేట్, గండిమైసమ్మ మార్గాల్లో ట్రాఫిక్ రద్దీ బాగా తగ్గనుంది.

HMDA ఆధ్వర్యంలో నిర్మించిన బాచుపల్లి జంక్షన్ ఫ్లైఓవర్ పనులు పూర్తయ్యాయి. ప్రారంభోత్సవానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయగా.. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుంది. వేగంగా విస్తరిస్తున్న బాచుపల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలకు ఇది ప్రధాన పరిష్కారంగా మారనుందని అధికారులు భావిస్తున్నారు.
గత కొన్నేళ్లుగా బాచుపల్లి జంక్షన్ పరిసర ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందడంతో వాహనాల రాకపోకలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో మియాపూర్, గాజులరామారం, నిజాంపేట్, బౌరంపేట్ వైపు వెళ్లే వాహనాలతో జంక్షన్ తీవ్ర రద్దీగా మారేది. కొన్నిసార్లు వాహనాలు దాదాపు అరగంట పాటు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయే పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రజాప్రతినిధుల విజ్ఞప్తుల మేరకు మూడు సంవత్సరాల క్రితం హెచ్‌ఎండీఏ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ప్రారంభించింది. సుమారు 1.3 కిలోమీటర్ల పొడవుతో ఆరు లేన్లుగా ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించారు. ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.141 కోట్లను మంజూరు చేయగా.. అందులో సుమారు రూ.71 కోట్లు ఫ్లైఓవర్ నిర్మాణానికి వినియోగించారు. మిగతా నిధులను భూసేకరణ, ఇతర అనుబంధ పనుల కోసం ఖర్చు చేశారు.
ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే మియాపూర్-గండిమైసమ్మ మార్గంలో ట్రాఫిక్ ఒత్తిడి చాలా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. అలాగే నిజాంపేట్, మల్లంపేట్ వైపు వెళ్లే వాహనాల రాకపోకలు కూడా మరింత సులభం కానున్నాయి. కొత్తగా రూపుదిద్దుకున్న జంక్షన్‌తో బాచుపల్లి ప్రాంత ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తగ్గనున్నాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
