AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రహ్మాండంలో మహా మిస్టరీ.. అన్ని గ్రహాలు ఒకవైపు తిరిగితే.. శుక్రుడు వెనక్కి ఎందుకు తిరుగుతాడు?

సౌర కుటుంబంలో గ్రహాలన్నీ ఒకవైపు తిరిగితే.. శుక్ర గ్రహం మాత్రం పూర్తి వ్యతిరేక దిశలో తిరుగుతుంది. భూమి సహా మిగిలిన గ్రహాలన్నీ ఒకే వాయువు, ధూళి మేఘం నుంచి పుట్టినప్పుడు.. శుక్రుడు మాత్రం ఎందుకు తిరుగుబాటుదారుడిలా వెనక్కి తిరుగుతున్నాడు? దశాబ్దాలుగా ఖగోళ శాస్త్రవేత్తలను మేధోమథనానికి గురిచేస్తున్న ఈ వింత వెనుక అసలు రహస్యమేంటి?

బ్రహ్మాండంలో మహా మిస్టరీ.. అన్ని గ్రహాలు ఒకవైపు తిరిగితే.. శుక్రుడు వెనక్కి ఎందుకు తిరుగుతాడు?
Why Does Venus Rotate Backwards
Krishna S
|

Updated on: Aug 07, 2026 | 10:16 AM

Share

చిన్నప్పుడు మనమందరం బడిలో నేర్చుకున్న విషయమేంటంటే.. మన సౌర కుటుంబంలోని గ్రహాలన్నీ ఒకే పెద్ద వాయువు – ధూళి మేఘం నుంచి పుట్టాయి. భౌతిక శాస్త్ర సూత్రాల ప్రకారం ఒకే మూలం నుంచి తయారయ్యాయి కాబట్టి అన్ని గ్రహాలు ఒకే దిశలో తిరగాలి. మన భూమి, అంగారకుడు, బృహస్పతి వంటి గ్రహాలన్నీ పడమర నుంచి తూర్పునకు తిరుగుతాయి. కానీ శుక్ర గ్రహం మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా తూర్పు నుంచి పడమరకు, అంటే వెనక్కి తిరుగుతుంది. దీనిని శాస్త్రవేత్తలు రెట్రోగ్రేడ్ రొటేషన్ అంటారు. దశాబ్దాలుగా శాస్త్రవేత్తలకు శోధనగా మారిన ఈ వింత వెనుక ప్రధానంగా 3 కారణాలు ప్రచారంలో ఉన్నాయి.

మహా ప్రళయం వంటి భారీ ఢీ

సౌర కుటుంబం ప్రారంభ రోజుల్లో తీవ్రమైన దాడులు, శకలాల ఘర్షణలు సర్వసాధారణంగా జరిగేవి. ఒక సిద్ధాంతం ప్రకారం.. శుక్ర గ్రహం ప్రారంభ దశలో ఉన్నప్పుడు దానికి దాదాపు సమానమైన పరిమాణంలో ఉన్న మరొక భారీ గ్రహశకలం దాన్ని వేగంగా ఢీకొని ఉండవచ్చు. ఆ ఘర్షణ తాకిడికి శుక్రుడి భ్రమణ దిశే పూర్తిగా తలకిందులైపోయి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భూమి చుట్టూ చంద్రుడు ఏర్పడటానికి, యూరేనస్ గ్రహం పక్కకు వంగి తిరగడానికి కూడా ఇలాంటి భారీ ఢీకొన్న సంఘటనలే కారణమని నమ్ముతారు కాబట్టి, శుక్రుడి విషయంలోనూ ఇదే జరిగి ఉండవచ్చనే బలమైన వాదన ఉంది.

గ్రహం అస్సలు తలకిందులు కాలేదా?

అయితే అందరూ శాస్త్రవేత్తలు ఈ భారీ ఢీ సిద్ధాంతాన్ని ఏకీభవించడం లేదు. ఫ్రెంచ్ పరిశోధకులు అలెగ్జాండర్ కొరేరియా, జాకస్ లాస్కర్ ప్రకారం.. శుక్ర గ్రహాన్ని ఏదీ ఢీకొట్టలేదు. సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి, అణువుల ఘర్షణ, శుక్రుడి సాంద్రమైన వాతావరణం వల్ల ఈ మార్పు నెమ్మదిగా జరిగి ఉండవచ్చు. కాలక్రమేణా శుక్రుడి భ్రమణ వేగం తగ్గిపోయి, దాదాపు ఆగిపోయే స్థితికి వచ్చి, చివరికి వ్యతిరేక దిశలో తిరగడం ప్రారంభించి ఉండవచ్చని వారి పరిశోధనలు చెబుతున్నాయి. అంటే శుక్రుడు ఒకేసారి తిరగబడలేదు, కోట్లాది సంవత్సరాల కాలంలో నెమ్మదిగా దిశ మార్చుకున్నాడు.

దట్టమైన వాతావరణం కూడా ఒక కారణమేనా?

సౌర కుటుంబంలోనే అత్యంత దట్టమైన, వేడి వాతావరణం ఉన్న గ్రహాలలో శుక్రుడు ఒకటి. సూర్యకాంతి వల్ల ఈ వాతావరణంలో ఉత్పన్నమయ్యే వేడి వాతావరణ అలలును సృష్టిస్తుంది. ఈ అలలు, గ్రహం లోపలి ఉపరితలం, కేంద్రకం మధ్య వచ్చే రాపిడి కలిసి శుక్రుడి వేగాన్ని కాలక్రమేణా తగ్గించివేశాయని పరిశోధకులు భావిస్తున్నారు. ఒక్కసారిగా జరిగిన విపత్తు కంటే, బిలియన్ల సంవత్సరాల పాటు చిన్న చిన్న శక్తి ప్రభావాల వల్ల శుక్రుడి దిశ మారిపోయిందనేది ఈ సిద్ధాంతం సారాంశం.

సంవత్సరం కంటే రోజే పెద్దది

శుక్రుడి వేగం ఎంత నెమ్మదిగా ఉందంటే.. అది తన చుట్టూ తాను ఒకసారి తిరగడానికి 243 రోజులు పడుతుంది. కానీ సూర్యుడి చుట్టూ ఒకసారి తిరగడానికి 224.7 భూమి రోజులు మాత్రమే పడుతుంది. అంటే శుక్ర గ్రహంపై ఒక సంవత్సరం కంటే ఒక రోజే చాలా పెద్దది. అంతేకాకుండా వ్యతిరేక దిశలో తిరగడం వల్ల శుక్రుడిపై సూర్యుడు పడమరన ఉదయించి, తూర్పున అస్తమిస్తాడు.

దశాబ్దాల పరిశోధనలు జరుగుతున్నప్పటికీ, శుక్రుడు వెనక్కి ఎందుకు తిరుగుతున్నాడనే దానికి శాస్త్రవేత్తల దగ్గర ఇప్పటికీ ఒకే ఒక్క ఆమోదయోగ్యమైన సమాధానం లేదు. బహుశా ఒక భారీ గ్రహశకలం ఢీకొనడం వల్ల మార్పు ప్రారంభమై.. ఆ తర్వాత వాతావరణ ప్రభావం వల్ల అది మరింత నిలకడగా మారి ఉండి ఉండవచ్చు. కారణం ఏదైనప్పటికీ, భూమితో పాటు ఒకే మేఘం నుంచి ఉద్భవించినప్పటికీ, అత్యంత విభిన్నంగా, తిరుగుబాటుదారుడిలా మిగిలిపోయిన శుక్రుడు అంతరిక్షంలో ఓ గొప్ప ఆశ్చర్యంగా నిలిచాడు.

Follow Us