Hyderabad: చాదర్‌ఘాట్‌లో మహిళ దారుణ హత్య.. ఆరు నెలల దూరమే కారణమా? మాజీ సహోద్యోగి అరెస్ట్
Hyderabad: మృతురాలి భర్త ఖాజా మొయిన్ ఉద్దీన్ ఫిర్యాదు మేరకు చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 392/2026 కింద భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 103 ప్రకారం హత్య కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా నిందితుడిగా గుర్తించిన మొహమ్మద్..

Hyderabad: పాతబస్తీ చాదర్‌ఘాట్‌లో మహిళను కత్తితో పొడిచి చంపిన మాజీ సహోద్యోగి.. వ్యక్తిగత సంబంధాలే హత్యకు దారితీసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడించారు. చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన తహేరా బాను హత్య కేసును పోలీసులు ఛేదించారు. అజాంపురలోని ఓ మహిళల దుస్తుల దుకాణంలో పనిచేస్తున్న తహేరా బానుపై పదునైన కత్తితో దాడి చేసి హత్య చేసిన కేసులో మొహమ్మద్ ఇబ్రహీంను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో అదే దుకాణంలో పనిచేసిన ఇబ్రహీం.. వ్యక్తిగత సంబంధాల నేపథ్యంలోనే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
ఆరు నెలలుగా దూరం.. చివరకు హత్య?
పోలీసుల ప్రకారం.. తహేరా బాను, నిందితుడు ఇబ్రహీం మధ్య గత కొన్నేళ్లుగా వ్యక్తిగత సంబంధం ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. అయితే గత ఆరు నెలలుగా తహేరా బాను ఇబ్రహీంను దూరంగా ఉంచుతూ, అతను ఫోన్ చేస్తే మాట్లాడకపోవడం ఇలాంటి వ్యక్తిగత కారణాలతో హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. దీంతో ఆమెపై ఇబ్రహీంకు కక్ష, ద్వేషం పెరిగినట్లు దర్యాప్తులో తేల్చారు తనకు దూరంగా ఉంటోందనే కారణంతో ఓ మహిళ ప్రాణాలు తీసేంత కక్ష పెంచుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వ్యక్తిగత సంబంధాల్లో ఏర్పడిన విభేదాలు చివరకు హత్యకు దారితీయడం ఈ ఘటనలో కలకలం లేపింది
దుకాణంలోనే కత్తితో దాడి
2026 అక్టోబర్ 9న రాత్రి సుమారు 9.30 గంటల సమయంలో అజాంపురలోని మన్‌హా లగ్జూరియస్ ఉమెన్స్ స్టోర్‌లో సేల్స్‌వుమన్‌గా పనిచేస్తున్న తహేరా బానుపై ఇబ్రహీం పదునైన కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను చికిత్స కోసం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. అయితే రాత్రి సుమారు 10.30 గంటలకు చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రెండు రోజుల వ్యవధిలో నిందితుడి అరెస్ట్:
మృతురాలి భర్త ఖాజా మొయిన్ ఉద్దీన్ ఫిర్యాదు మేరకు చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 392/2026 కింద భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 103 ప్రకారం హత్య కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా నిందితుడిగా గుర్తించిన మొహమ్మద్ ఇబ్రహీం (35)ను అక్టోబర్ 11న పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం న్యాయస్థానం ఎదుట హాజరు పరిచారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
