AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్-విజయవాడ హైవేకు మహర్దశ.. ఇక ఎంత టైంలో రీచ్ అవుతారో తెలుసా..?

హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారి-65కు భారీ అప్‌గ్రేడ్‌కు మార్గం సుగమమైంది. 285 కిలోమీటర్ల మేర రూ.12,073.99 కోట్ల అంచనా వ్యయంతో ఆరు వరుసలుగా హైవేను అభివృద్ధి చేయనున్నారు. సర్వీస్ రోడ్లు, క్రాష్ బారియర్లు, ప్రతి 15-18 కిలోమీటర్లకు ఎంట్రీ-ఎగ్జిట్ పాయింట్లతో పాటు ప్రయాణించిన దూరానికే టోల్ వసూలు చేసే విధానాన్ని ప్రతిపాదించారు. ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్-విజయవాడ ప్రయాణ సమయం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

హైదరాబాద్-విజయవాడ హైవేకు మహర్దశ.. ఇక ఎంత టైంలో రీచ్ అవుతారో తెలుసా..?
Hyderabad Vijayawada Highway
Prabhakar M
| Edited By: |

Updated on: Sep 02, 2026 | 10:00 AM

Share

హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా మచిలీపట్నం వరకు వెళ్లే జాతీయ రహదారి-65కు భారీ అప్‌గ్రేడ్‌కు మార్గం సుగమమైంది. మొత్తం 285 కిలోమీటర్ల మేర రహదారిని ఆరు వరుసలుగా అభివృద్ధి చేసే ప్రతిపాదనకు పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ అప్రైజల్ కమిటీ (పీపీపీఏసీ) ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.12,073.99 కోట్లుగా ఉంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును మూడు ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టనున్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు తర్వాత ఆందోల్ మైసమ్మ ఆలయం సమీపం నుంచి విజయవాడ గొల్లపూడి వరకు 181 కిలోమీటర్ల మార్గాన్ని తొలి ప్యాకేజీగా అభివృద్ధి చేయనున్నారు. హైదరాబాద్ నుంచి నందిగామ వరకు 45 కిలోమీటర్ల భాగం రెండో ప్యాకేజీలో, విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు 59.69 కిలోమీటర్ల మార్గం మూడో ప్యాకేజీలో ఉంటుంది.

మూడు ప్యాకేజీలు.. భారీ వ్యయం

అధికారుల అంచనాల ప్రకారం తొలి ప్యాకేజీకి రూ.7,321.97 కోట్లు ఖర్చవుతాయి. రెండో ప్యాకేజీకి రూ.2,965.11 కోట్లు, మూడో ప్యాకేజీకి రూ.1,786.91 కోట్ల వ్యయం అవుతుందని అంచనా.. భూసేకరణ, రహదారి నిర్మాణం, జీఎస్టీ తదితర అన్ని వ్యయాలను కలిపితే ఒక్కో కిలోమీటరుకు సగటున రూ.38 కోట్ల వరకు ఖర్చు కానుంది.

తెలంగాణలో యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల మీదుగా ఈ రహదారి సాగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల పరిధిలో పనులు కొనసాగనున్నాయి.

భూసేకరణకు ప్రత్యేక ప్రణాళిక

తెలంగాణ పరిధిలోని రెండు ప్యాకేజీలకు సంబంధించి భూసేకరణ కోసం రూ.1,453.88 కోట్ల వరకు అవసరమవుతుందని అంచనా వేశారు. ఈ రెండు ప్యాకేజీలకు కలిపి 1,387.628 హెక్టార్ల భూమి అవసరం కాగా.. ఇప్పటికే 1,174.295 హెక్టార్ల భూమి అందుబాటులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఇంకా 213.33 హెక్టార్ల భూమిని ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించాల్సి ఉంటుంది. ఇక విజయవాడ-మచిలీపట్నం విభాగంలో 351.185 హెక్టార్ల భూమి అవసరం కాగా.. 344.685 హెక్టార్లు అందుబాటులో ఉంది. దీంతో అదనంగా సుమారు 6.50 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంటుంది.

హైస్పీడ్ కారిడార్‌గా NH-65

హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం మొత్తం మార్గాన్ని హైస్పీడ్ కారిడార్ తరహాలో అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుత రహదారిని ఆరు వరుసలుగా విస్తరించడంతో పాటు భద్రత కోసం రెండు వైపులా క్రాష్ బారియర్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రధాన రహదారికి ఇరువైపులా రెండు వరుసల సర్వీస్ రోడ్లను కూడా నిర్మించనున్నారు. దీంతో ప్రధాన రహదారిపై స్థానిక రాకపోకల ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది.

ప్రతి 15-18 కిలోమీటర్లకు ఎంట్రీ, ఎగ్జిట్..

కొత్తగా అభివృద్ధి చేసే కారిడార్‌లో ప్రయాణికుల ప్రవేశ, నిష్క్రమణ కోసం ప్రత్యేక పాయింట్లను ఏర్పాటు చేయనున్నారు. సుమారు ప్రతి 15 నుంచి 18 కిలోమీటర్లకు ఒక ఎంట్రీ-ఎగ్జిట్ పాయింట్ ఉండేలా ప్రణాళిక రూపొందించారు. ఈ విధానంలో రెండు దిశల్లో కలిపి దాదాపు 30 టోల్ ప్లాజాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

ప్రయాణించిన దూరానికే టోల్

ఈ ప్రాజెక్టులో టోల్ వసూళ్లకు కొత్త విధానాన్ని అమలు చేయాలని ప్రతిపాదించారు. వాహనం ఎంత దూరం ప్రయాణిస్తే అంత మేరకే టోల్ చెల్లించే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు.

ఔటర్ రింగ్ రోడ్డుపై ఉన్న విధానాన్ని పోలిన సాంకేతిక వ్యవస్థ ద్వారా వాహనం హైవేలోకి ప్రవేశించే సమయంలో వివరాలు నమోదు అవుతాయి. ప్రయాణికుడు హైవే నుంచి బయటకు వచ్చే సమయంలో ప్రయాణించిన దూరాన్ని లెక్కించి టోల్ వసూలు చేసేలా వ్యవస్థను రూపొందించనున్నారు.

కేంద్ర క్యాబినెట్ ఆమోదం కోసం..

హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం హైవే విస్తరణ ప్రతిపాదనకు పీపీపీఏసీ ఆమోదం లభించడంతో తదుపరి ప్రక్రియకు మార్గం ఏర్పడింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు ప్రతిపాదన కేంద్ర మంత్రివర్గం పరిశీలనకు వెళ్లనుంది.

తగ్గనున్న ప్రయాణ సమయం..

కేంద్ర క్యాబినెట్ నుంచి తుది ఆమోదం లభించిన తర్వాత టెండర్లు, నిర్మాణానికి సంబంధించిన తదుపరి చర్యలను ప్రారంభించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ నుంచి విజయవాడ, మచిలీపట్నం వైపు ప్రయాణం మరింత వేగంగా, సురక్షితంగా మారే అవకాశం ఉంది. అంతేకాకుండా.. ప్రయాణ సమయం దాదాపు గంట వరకు తగ్గే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. సౌకర్యవంతంగా దీనిని నిర్మించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణ సమయం దాదాపు 5గంటలకు పైగా ఉంది. ఇది బాగా తగ్గుతుందని పేర్కొంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us