
హైదరాబాద్ వాహనదారులూ బీ అలెర్ట్. పదేపదే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతూ, పెండింగ్ చలాన్లు సకాలంలో కట్టని వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు దృష్టి పెట్టారు. రెండింతల ఫైన్లు వసూల్ చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. మూడు నెలల వ్యవధిలో జరిమానాలు సరిగ్గా చెల్లించకుండా, పదేపదే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిపై మోటారు వాహనాల చట్టంలోని పలు కీలక సెక్షన్లను వినియోగించనున్నారు. ఈ మేరకు వారు చేసిన ట్రాఫిక్ వైలేషన్స్‌కు డబుల్ జరిమానాలు విధించనున్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, అక్రమ పార్కింగ్, సిగ్నల్ జంపింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, ఓవర్ లోడింగ్ తదితర ఉల్లంఘనలకు ఈ విధానం వర్తించనుండగా.. దీనికి సంబంధించి నగర ట్రాఫిక్ విభాగంగా ఇప్పటికే ప్రాధమికంగా కసరత్తు ప్రారంభించింది.
కాగా, ఈ-విధానంపై ట్రాఫిక్ పోలీసులు లోతైన అధ్యాయాన్ని నిర్వహించారు. ఇప్పటిదాకా మోటారు వాహనాల చట్టంలో వినియోగించని పలు కీలక సెక్షన్లను అమలులోకి తీసుకురానున్నారు. వాహనదారుల్లో క్రమశిక్షణ పెంచడం, రోడ్డు ప్రమాదాలు నివారించడంలో భాగంగా ఇకపై ఈ విధానాన్ని వాడుకలో తీసుకురావాలని నిర్ణయించారు.