
హైదరాబాద్ మహబూబ్ మాన్షన్‌గా పిలువబడే మలక్‌పేట గంజ్ మార్కెట్‌లో అక్రమ దందా గుట్టురట్టయింది. ప్రముఖ కంపెనీల పేరుతో అందమైన ప్యాకింగులు, కంపెనీల లేబుళ్లతో పాటు అనేక ప్రమాణాలను పాటిస్తున్నామనే డిస్ట్రిబ్యూటర్ల ప్రకటనలు అంతా బూటకమని టాస్క్‌ఫోర్స్ పోలీసుల సోదాల్లో తేలింది.
నాసిరకం వంటనూనెకు కంపెనీ లేబుళ్లు వేసి నాణ్యమైన వంట నూనెగా విక్రయాలు జరుపుతున్నారు కేటుగాళ్లు. హలీమ్ సీజన్ కావడంతో లారీలకొద్దీ కల్తీ నూనె షాపులకు తరలిస్తున్నారు. మలక్‌పేటలోని శ్రీ గణేష్ బాలాజీ ఆయిల్ కంపెనీ షాపుపై దాడులు నిర్వహించిన సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు… షాకింగ్ విషయాలు వెల్లడించారు. అధిక లాభాల కోసం వంట నూనెతో అక్రమ దందా చేస్తున్నారని గుర్తించారు. ప్రముఖ ఆయిల్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్‌గా చెప్పుకుంటూ రెచ్చిపోతున్నారని తెలిపారు. గోడౌన్ డ్రమ్ముల్లో ఉన్న నూనెను 20 లీటర్ల క్యానుల్లో హోటళ్లకు తరలిస్తున్నట్లు తేల్చారు. అంతేకాదు పెద్ద ఎత్తున పేరున్న కంపెనీల కార్టన్లను పోలి ఉన్న ఖాళీ అట్టపెట్టెలు, ప్రముఖ కంపెనీల లేబుళ్లు గుట్టలుగా పడి ఉండటం చూసి అవాక్కయ్యారు. గోదాము నిండా ఆయిల్ నింపని నూనె డబ్బాలు దర్శనమివ్వడంతో అసలీ దందా ఎప్పటినుంచి జరుగుతోంది…? ఇప్పటివరకూ ఎంత కల్తీ నూనె సప్లై చేశారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..