ప్రజల్లో ఫ్యాన్సీ నెంబర్లకు ఉండే క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అచ్చొచ్చే నెంబర్ అనో, న్యూమరాలజీ ప్రకారమో తమకు నచ్చిన నెంబర్‌ను ఎంచుకోవాలని ఆశపడుతుంటారు. అందరిలో ప్రత్యేకంగా నిలవాలని కోరుకుంటారు. ఇందుకోసం ఎంత ఖర్చు అయినా పర్లేదని భావిస్తుంటారు. అలాంటి వారి కోసమే రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీఏ) వేలంపాట నిర్వహిస్తుందని తెలిసిందే.
ఇందులో భాగంగానే పలు ఫ్యాన్సీ నెంబర్లను ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తుంటారు. తాజాగా జరిగిన వేలంలో అత్యధిక ధరకు ఫ్యాన్సీ నెంబర్లను సొంతం చేసుకున్నారు. బుధవారం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లోని రవాణా కార్యాలయంలో నిర్వహించిన వేలం పాటలో ఫ్యాన్సీ నెంబర్లను భారీ మొత్తానికి దక్కించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వేలంపాట ద్వారా ప్రభుత్వానికి ఏకంగా రూ. 51,17,514 సమకూరడం గమనార్హం. దీనిబట్టే ఫ్యాన్సీ నెంబర్లకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థమవుతోంది.
ఈ వేలంపాటలో భాగంగా టీజీ 09 A 9999 నెంబర్‌ను ఏకంగా రూ. 19,51,111కి సొంతం చేసుకున్నారు. హానర్స్ డెవపలర్స్ అనే సంస్థ ఈ నెంబర్‌ను సొంతం చసుకుంది. ఇక కొత్త ప్రారంభమైన టీజీ 09 B 0001 నెంబర్‌ను ఎన్‌జీ మైంజ్ ఫ్రేమ్ అనే సంస్థ రూ. 8.25 లక్షలకు దక్కించుకుంది. అలాగే TG 09 B 0009 నెంబర్‌ను రూ 6,66,666కి, TG 09 B 0006 నెంబర్‌ని రూ 2,91,166కి, టిజి 09 బి 0005 రూ. 2,50,149 అలాగే టిజి 09 బి 0019 నెంబర్‌ని రూ. 1,30,000 దక్కించుకున్నట్లు అధికారులు తెలిపారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..