
New Year Celebrations: ఇక కొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం సమీపిస్తోంది. న్యూ ఇయర్ రోజు ఏం చేయాలనే దానిపై ఇప్పటినుంచే చాలామంది ప్లాన్లు వేసుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి సెలబ్రేషన్స్ చేసుకునేందుకు ముందుగానే ప్రిపేర్ అవుతున్నారు. ఎక్కడికైనా బయటకు వెళ్దామా..? లేక ఇంట్లోనే స్నేహితులు, కుటుంబసభ్యులతో కలిసి జరుపుకుందామా? అనే దానిపై ఆలోచనలు చేస్తున్నారు. డిసెంబర్ 31 రాత్రి హైదరాబాద్‌లో ప్రతీచోట న్యూఇయర్ సెలబ్రేషన్స్ జరిపేందుకు ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు, రెస్టారెంట్లు, పబ్‌లు ఇప్పటినుంచే తమ ప్రణాళికలను సిద్దం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ పోలీసుల నుంచి కీలక ప్రకటన వచ్చింది.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నిర్వహించే ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు తప్పనిసరిగా తమ నుంచి అనుమతులు తీసుకోవాలని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి స్పష్టం చేశారు. ఇందుకోసం ఆన్‌లైన్‌లో cybpms.telangana.gov.in వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఈ వెబ్‌సైట్ ద్వారా ఈ నెల 21లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆ తర్వాత తాము దరఖాస్తులను పరిశీలించి అనుమతులు జారీ చేస్తామని వెల్లడించారు. 21వ తేదీ తర్వాత వచ్చే అప్లికేషన్లు తాము పరిగణలోకి తీసుకోమని తెలిపారు. టికెట్ ఈవెంట్లకు కమర్షియల్ ఫారంను, ఉచిత సెలబ్రేషన్స్‌కు నాన్ కమర్షియల్ ఫారంను ఆన్‌లైన్‌లో పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు.
ఇక సాధారణ ప్రజలు ప్రశాంతంగా ఇతరులకు ఇబ్బంది కలగకుండా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని సీపీ అవినాశ్ మహంతి సూచించారు. డీజే సౌండ్స్ తక్కువగా పెట్టుకోవాలని, ఇతరులకు అసౌకర్యం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. మద్యం తాగి రోడ్లపైకి వచ్చి కేకలు వేడయం సరికాదని, అలాంటివారిని తాము నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇక డిసెంబర్ 31 రాత్రి డ్రంకన్ డ్రైవ్ టెస్టులు విస్తృతంగా చేపడతామని, రోడ్లపై నానా హంగామా చేయడం లాంటి పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈవెంట్లు జరిగే చోట అగ్నిప్రమాదాలు చోటుచేసుకోకుండా సేఫ్టీ ఏర్పాట్లు, సీసీ కెమెరాలు వంటివి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.