Police Case on YCP Leader PVP: ప్రముఖ వ్యాపారవేత్త , వైసీపీ నేత పోట్లూరీ వరప్రసాద్(PVP)పై హైదరాబాద్ పోలీసులు మరోసారి కేసు నమోదు చేశారు. భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కుమార్తె ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేశారు. తన ఇంటి గోడను ఇతరులతో కలిసి బలవంతంగా కూలగొట్టించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 7లో ఓ విల్లాను డికే అరుణ కుమార్తె శృతి రెడ్డి కొనుగోలు చేశారు. ఇంటి మరమత్తుల్లో భాగంగా ప్రహరి గోడ నిర్మాణం చేపట్టారు. అయితే శృతిరెడ్డి ఇంట్లోకి ప్రవేశించి ప్రహరి గోడతో పాటు రేకులను సైతం పీవిపీ అనుచరుడు బాలాజీ మరికొందరితో కలిసి జేసీబితో ధ్వంసం చేయించారు. దీన్ని ప్రశ్నించిన శృతిరెడ్డిపై బెదిరింపులకు పాల్పడినట్లు తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పీవిపీతోపాటు సంఘటన స్థలంలో ఉన్న బాలాజీ, అతనికి సహకరించిన మరికొందరిపై కేసు నమోదు చేశామని బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.
కాగా గతంలో పీవిపీ తన రియల్ కంపనీ ద్వారా ప్రేమ్ పర్వత్ విల్లాస్ అనే వెంచర్ వేసి విక్రయించారు. అయితే విల్లాలు కొనుగోలు చేసిన వారు తమకు అనుకూలంగా ఇంటిని మార్చుకుంటుండడంతో ఆయన అడ్డుకుంటున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. ఇలా గత రెండు సంవత్సరాల క్రితం కూడా ఓ రినోవేషన్ చేసుకుంటున్న ఇంట్లోకి ప్రవేశించి ఆ ఇంటిని కూలగొట్టినట్టు కేసు నమోదైంది. కాగా ఆ కేసు విచారణకు వెళ్లిన పోలీసులపైకి ఆయన కుక్కల్ని వదలడంతో ఆ కేసు సైతం వివాదస్పదమైంది. దీంతో ఆకేసులో ముందస్తు బెయిల్ తెచ్చుకోవడంతో కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. తాజాగా అదే తరహాలో మరో కేసు నమోదు కావడం చర్చనీయంశంగా మారింది. పీవీపీతో పాటు ఆయన అనుచరులపై IPC 447,427,506,509 r/w34 కింద కేసు నమోదు చేసినట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.
Read Also…. Punjagutta Steel Bridge: గురువారం నుంచి అందుబాటులోకి రానున్న పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జి! ..చిత్రాలు