Hyderabad: మల్టీ లెవెల్ మాటలతో మాయ చేస్తారు.. నమ్మి వెళ్లారో నట్టేట ముంచేస్తారు..

అమాయకులే టార్గెట్‌గా హైదరాబాద్‌లో భారీ మొత్తంలో మనీ సర్క్యులేషన్ చేస్తున్న ఓ నెట్‌వర్క్‌ను హైదరాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో దాడులు చేసి ఈ నెట్‌వర్క్‌కు సంబంధించి మొత్తం ఆరుగురు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధిచిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి..

Hyderabad: మల్టీ లెవెల్ మాటలతో మాయ చేస్తారు.. నమ్మి వెళ్లారో నట్టేట ముంచేస్తారు..
Hyderabad Police Bust Ignite Mlm Scam

Edited By:

Updated on: Jun 11, 2026 | 5:26 PM

నగరంలో అమాయకులను లక్ష్యంగా చేసుకుని భారీ స్థాయిలో మనీ సర్క్యులేషన్ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘ఇగ్నైట్’ నెట్‌వర్క్‌పై హైదరాబాద్ సీసీఎస్ ఉక్కుపాదం మోపింది. ‘ఆపరేషన్ ఇగ్నైట్ క్రాక్‌డౌన్’ పేరుతో చేపట్టిన ప్రత్యేక చర్యల్లో భాగంగా కేరళ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో దాడులు నిర్వహించి ఆరుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు గురువారం వెల్లడించారు. అరెస్టైన వారిలో ఇగ్నైట్ టీం నాయకుడు, రిక్రూటర్ ఒనియల్ గుప్తా, ఇండి కనెక్ట్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు దినేశ్ కుమార్ సాహిల్, ప్రియాంశు సక్సేనా, కోల్‌కతాకు చెందిన పరస్నాథ్ మర్కంటైల్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు ప్రవీణ్ కుమార్ డకాలియా, పరితోష్ కుమార్ డకాలియా, కేరళకు చెందిన ఫీల్డ్ రిక్రూటర్ రియాజ్ ఉన్నట్లు తెలిపారు.

బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి..

జూన్ 5, 6 తేదీల్లో హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు బాధితులు వేర్వేరు మార్గాల ద్వారా ఈ ‘ఇగ్నైట్’ నెట్‌వర్క్‌లో చేరి, రూ. 61,639 నుంచి రూ. 63,899 వరకు చెల్లించారు. ఇలా బాధితుల నుంచి మొత్తం రూ. 1.87 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాధితులందరినీ ఒకే బ్యాంకు ఖాతాలో డబ్బు జమ చేయాలని నిందితులు సూచించారు. ఆ ఖాతా కోల్‌కతాకు చెందిన ‘పరస్నాథ్ మర్కంటైల్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థదిగా పోలీసులు తేల్చారు. మొదట మూడు వేర్వేరు స్టేషన్లలో కేసులు నమోదైనప్పటికీ, ఇదంతా ఒకే నెట్‌వర్క్ మోసమని గుర్తించిన ఉన్నతాధికారులు కేసులను సమగ్ర దర్యాప్తు నిమిత్తం సీసీఎస్ (CCS) కు బదిలీ చేశారు.

ముందస్తు ప్రణాళికతోనే మోసాలు!

ప్రాథమిక దర్యాప్తులో ‘ఇగ్నైట్’ సంస్థ హాంకాంగ్ కేంద్రంగా పనిచేస్తున్న మల్టీ లెవెల్ మార్కెటింగ్ వ్యవస్థగా పోలీసులు గుర్తించారు. గతంలో దేశంలో తీవ్ర వివాదాస్పదమైన క్యునెట్ , విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ నెట్‌వర్క్‌లతో సంబంధం ఉన్న పాత క్రిమినల్స్ ప్రచారంలో ఉండి, ప్రస్తుతం ఈ ఇగ్నైట్ కార్యకలాపాలను నడుపుతున్నట్లు గుర్తించారు. ఇండి కనెక్ట్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను మే 18, 2026న స్థాపించగా.. కేవలం 18 రోజుల్లోనే మొదటి ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, సంస్థ అధికారికంగా ఏర్పాటు కాకముందే వెబ్‌సైట్ డొమైన్‌ను రిజిస్టర్ చేశారు. దీన్ని బట్టి ఇదంతా ముందస్తు ప్రణాళికతో చేసిన మోసమని అర్థమవుతోంది అని పోలీసులు తెలిపారు.

మెంబర్‌షిప్ పేరిట మాయాజాలం

అయితే ఈ నెట్‌వర్క్‌లో చేరిన వారు తమ డబ్బులు రీఫండ్ కావాలంటే.. కచ్చితంగా ఇద్దరు కొత్త సభ్యులను చేర్చాలి లేదా సంస్థ ఈ-వాలెట్‌లో 200 అమెరికన్ డాలర్లను నిల్వ ఉంచాలని పోలీసులు తెలిపారు. దీంతో ఉత్పత్తుల అమ్మకం కంటే సభ్యుల చేరిక ద్వారానే ఆదాయం పొందే విధానం అమలవుతోందని పోలీసులు అనుమానిస్తున్నారు.

సాయుధ దళాలకూ వల..

ఈ ముఠా భారత సాయుధ దళాలకు చెందిన సిబ్బందిని సైతం ఈ నెట్‌వర్క్‌లోకి లాగేందుకు ప్రయత్నించినట్లు పోలీసులకు కొన్ని కీలక వీడియో ఆధారాలు లభించాయి. అలాగే, ఈ సంస్థ విక్రయిస్తున్నట్లు చెప్తున్న హెల్త్ అండ్ వెల్‌నెస్ ఉత్పత్తులకు సంబంధించి ఎలాంటి ప్రభుత్వ నియంత్రణ సంస్థల ఆమోదాలు లేవని స్పష్టమైంది.

ప్రస్తుతం ఈ కేసులో నిధుల మళ్లింపు , అంతర్జాతీయ విదేశీ లావాదేవీలు, వివిధ నకిలీ సంస్థల మధ్య ఉన్న లింకులపై సీసీఎస్ పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. ఈ భారీ స్కామ్‌లో మరికొంతమంది కీలక సూత్రధారుల పాత్రపై విచారణ కొనసాగుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us